
హుస్నాబాద్,వెలుగు: అనుమానాస్పదంగా గురుకుల విద్యార్థి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంగునూరు మండల కేంద్రానికి చెందిన సనాదుల వివేక్(13), హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ లో 8వ క్లాస్ చదువుతున్నాడు. విద్యార్థులు స్కూల్ లో మంగళవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత క్లాస్ లకు వెళ్లిపోయారు.
వివేక్ వాష్ రూమ్కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కొద్దిసేపటికి స్కూల్ సెకండ్ ఫ్లోర్ కారిడార్ రేయిలింగ్ కు మెడకు తాడుతో వేలాడుతూ కనిపించాడు. ఓ టీచర్ వెంటనే అతడిని కిందకు దించి సీపీఆర్ చేసి హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వివేక్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందడంతో సీఐ కొండ్ర శ్రీను, ఎస్ఐ లక్ష్మారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులకు చెప్పడంతో వెంటనే స్కూల్కు వెళ్లి బోరున విలపించారు.
ప్రిన్సిపాల్ శ్యామలాదేవి వివరణతో సంతృప్తి చెందలేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. దళిత విద్యార్థి చనిపోయినా కలెక్టర్, డీఈఓ, ఆర్డీవో ఎందుకు రాలేదని మండిపడ్డారు. ఏసీపీ సదానందం వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా విరమించారు. మృతిచెందిన విద్యార్థి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.