మీ అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయిందని.. హాస్టల్ నుంచి ఫోన్.. తీరా వెళ్లి చూసేసరికి..

మీ అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయిందని.. హాస్టల్ నుంచి ఫోన్.. తీరా వెళ్లి చూసేసరికి..

బాగల్ కోటె: పాపం.. ఏ కష్టమొచ్చిందో తెలియదు.. కాలేజీలో చదువుకుంటూ ఒక ప్రైవేట్ పీజీలో ఉంటున్న టీనేజ్ అమ్మాయి.. పీజీలోని గదిలో ఉరేసుకుని కనిపించింది. ఉరికి వేలాడుతూ కనిపించిన అమ్మాయిని చూసి అదే పీజీలో ఉంటున్న అమ్మాయిలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషాద ఘటన కర్నాటకలోని బాగల్‌కోటెలో జరిగింది. బాగల్ కోటెలోని విద్యాగిరి అనే ప్రాంతంలో ఉన్న పీజీ హాస్టల్లో ఈ ఘటన జరిగింది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సీమా రాథోడ్ అనే 17 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న పీయూ కాలేజ్లో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు.. సీమా తన గదిలో ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఉరికి వేలాడుతున్న సీమాను చూసి పీజీలోని అమ్మాయిలు భయంతో బెంబేలెత్తిపోయి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పీజీ హాస్టల్ నిర్వాహకులు ఆమెను కిందకు దించి అంబులెన్స్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించారు.

హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్కు చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య అయి ఉండదని, తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని సీమా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీమా మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.

►ALSO READ | కేరళ నుంచి ఢిల్లీకి ఒంటరిగా విమానంలో 13 ఏళ్ల బాలిక: షాకైన పోలీసులు, ఎయిర్ పోర్ట్ అధికారులు

సీమా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కూతురికి మూర్ఛ వచ్చిందని హాస్టల్ నుంచి ఫోన్ చేస్తే వచ్చామని, వచ్చి చూస్తే తమ కూతురు చనిపోయిందని చెప్పారని కన్నీరుమున్నీరయ్యారు. హాస్టల్ యాజమాన్యంపై సీమా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ హాస్టల్లోనే ఏదో జరిగిందని, తమ కూతురిని వీళ్లే ఏదో చేశారని హాస్టల్ సిబ్బందిపై, నిర్వాహకులపై సీమా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.