
కేరళలోని తిరువనంతపురంలో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక గురువారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో వాణిజ్య విమానం ఎక్కిన తర్వాత పట్టుకున్నారు. సమాచారం ప్రకారం, పెద్దల తోడు లేకుండా తిరువనంతపురం నుండి ఢిల్లీకి విమానంలో వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఆ బాలికను గుర్తించి పట్టుకున్నారు. అలాగే దీనికి సంబంధించి కేరళ పోలీసులు, విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
గురువారం ఉదయం 7 గంటల సమయంలో విజింజంలో ఇంటి నుండి కనిపించకుండా పోయిందని బాలిక పై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. ఆ బాలిక కేరళ రాజధానిలో ఉంటున్న ఓ వలస బెంగాలీ తల్లిదండ్రుల కుమార్తె అని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఆమెను విమానాశ్రయానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ గురించి వారికి కొంత సమాచారం అందింది. దింతో ఆటో డ్రైవర్ సమాచారం ఆధారంగా పోలీసులు విమానాశ్రయానికి వెళ్లారు, అక్కడ బాలిక ఢిల్లీకి విమానంలో వెళ్లిందని తెలిసింది.
తరువాత తిరువనంతపురం పోలీసు కమిషనర్ వెంటనే ఆ బాలిక గురించి IGIA అధికారులకు సమాచారం అందించగా.. ఆమె అక్కడికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ చెక్-ఇన్, బోర్డింగ్ ఎలా దాటగలిగింది, రెండు రాష్ట్రాల మధ్య ఎవ్వరి తోడు లేకుండా ఎలా ప్రయాణించగలిగింది అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. అలాగే అసలు ఆ అమ్మాయి విమాన టికెట్ ఎలా కొన్నదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. వేరే ఎవరైనా ఆమెకు టికెట్ ఇచ్చి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విమానాశ్రయ అధికారుల ప్రకారం తోడు లేని చిన్న పిల్లలు ప్రయాణం చేయడానికి ఉండే పద్ధతులను ఆ అమ్మాయి గమనించకుండా ఉండొచ్చు లేదా కావాలనే తప్పించుకుని వెళ్లి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కేరళ పోలీసులు చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసి ఆమెను తిరిగి తీసుకురావడానికి ఢిల్లీకి ఒక ప్రత్యేక బృందాన్ని పంపింది.
ఈ ఘటన ఇటీవల KAM ఎయిర్ ప్యాసింజర్ విమానంలోని ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో కాబూల్ నుండి ఢిల్లీకి ప్రయాణం చేసిన 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడి ఘటన తరువాత జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ నగరానికి చెందిన ఆ బాలుడు, గత సోమవారం విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై తిరుగుతూ కనిపించాడని అధికారులు తెలిపారు.