తెలంగాణలో పలు చోట్లా ..ఘనంగా స్వామి వివేకానంద జయంతి

తెలంగాణలో పలు చోట్లా ..ఘనంగా స్వామి వివేకానంద జయంతి

బషీర్​బాగ్/మేడ్చల్/చేవెళ్ల, వెలుగు : స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని రామకృష్ణ మఠంలోని ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. శక్తి సామర్థ్యాలున్నప్పుడే ఉత్తమ కార్యాలు చేయాలని స్వామి వివేకానంద చెప్పారన్నారు. అనంతరం పర్వతారోహకులు మాలావత్ పూర్ణ, బానోతు వెన్నెలకు వివేకానంద యంగ్‌ అచీవ్‌మెంట్ అవార్డులను అందించారు.

పాలమూరుకు చెందిన సేవాభారతి కార్యకర్త కాశీనాథ్‌ చేస్తున్న కార్యక్రమాలను స్వామి బోధమయానంద ప్రశంసించారు. యువజనోత్సవాల్లో భాగంగా థియేటర్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌ దీనబాంధవ దర్శకత్వంలో స్వామి వివేకానంద జీవితంపై వీఐహెచ్‌ఈ స్టూడెంట్లు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి

ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. నారాయగూడలోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో వివేకానంద జయంతిని నిర్వహించారు. పాట్నా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.  

గౌడవెల్లిలో స్వామి వివేకానంద జయంతి

మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పంచాయతీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. నేటి తరం వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.