రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన స్వాతి మలివాల్

రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన  స్వాతి మలివాల్

న్యూఢిల్లీ: ఆమ్​ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌‌ (డీసీడబ్ల్యూ)  మాజీ చీఫ్‌‌ స్వాతి మలివాల్‌‌, ఆ పార్టీ ఎంపీలు సంజయ్‌‌ సింగ్‌‌, ఎన్‌‌డీ గుప్తా.. సివిల్ లైన్స్‌‌లోని ఢిల్లీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ ఆఫీస్​లో నామినేషన్లను దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్‌‌ మాజీ చీఫ్ స్వాతి​మలివాల్‌‌ను ఆమ్​ఆద్మీ పార్టీ శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

 ఆమెతో పాటు ప్రస్తుతం ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న  సంజయ్‌‌ సింగ్‌‌, ఎన్‌‌డీ గుప్తాలను రెండో సారి నామినేట్​ చేసింది. ఆప్​నుంచి ప్రస్తుతం సంజయ్​ సింగ్, ఎన్డీ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారి ఆరేండ్ల పదవీకాలం ఈ నెల 27తో ముగియనున్నది. సుశీల్ గుప్తా స్థానంలో మలివాల్ పేరును పార్టీ ప్రతిపాదించింది. శుక్రవారం ఆప్ తన రాజ్యసభ అభ్యర్థిగా మలివాల్ ను ప్రకటించిన వెంటనే ఆమె మహిళా కమిషన్​ చైర్‌‌ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. 

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మలివాల్ మాట్లాడుతూ.. తన లాంటి సామాన్య మహిళను రాజ్యసభకు పంపుతున్నందుకు ఆమె ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌‌ కు ధన్యవాదాలు తెలిపారు. డీసీడబ్ల్యూ చీఫ్‌‌గా తన ఎనిమిదేండ్ల పని తపస్సు లాంటిదని, ఈ టైంలో తాను 1,70,000 కేసులు హ్యాండిల్​ చేశానని చెప్పారు. రాత్రింబవళ్లు పనిచేశానని, ఇంతకాలం వీధుల్లో వినిపించిన తన స్వరం ఇప్పుడు మహిళలు, యువకులు, రైతులు, దేశంలోని ప్రతి పౌరుడి కోసం ఎగువ సభలో ప్రతిధ్వనిస్తుందని మలివాల్​పేర్కొన్నారు. కాగా, ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.