
Klarna On AI: ప్రస్తుతం ఎవరినోట విన్నా ఒక్కటే మాట అదే ఏఐ. టెక్నాలజీ రంగంలో ఉన్న, పనిచేస్తున్న ఉద్యోగులను ఇది వెంటాడుతోంది. లక్షల సంఖ్యలో ఉద్యోగులను ఏఐ రీప్లేస్ చేస్తుందనే వాదనలు పెరుగుతున్నాయి. వాస్తవానికి అనేక టెక్ కంపెనీల్లో ఇది నిజంగా జరుగుతోంది కూడా. ఐబీఎం లాంటి పెద్ద కంపెనీలు సైతం తీసేసిన ఉద్యోగుల స్థానంలో ఏఐ వాడతామని చెప్పిన సంగతి తెలిసిందే. లక్షల్లో వేతనాలు పొందుతున్న టెక్ ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితులతో ఆందోళనలో ఉన్నారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి మదిలో ఉన్న ఆలోచన ఒక్కటే.. నిజంగా ఏఐ మనుషులను రీప్లేస్ చేస్తుందా అన్నదే. తాజాగా స్వీడిష్ ఫిన్ టెక్ సంస్థ క్లార్నా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. వాస్తవానికి కంపెనీ కొన్నాళ్ల కిందట దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించింది. వారి స్థానంలో ఏఐని వినియోగించటం ప్రారంభించింది. ఉద్యోగులను తగ్గించుకోవటానికి చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టిందని కంపెనీ వెల్లడించింది. తమ కస్టమర్ కేర్ క్వాలిటీ ఏఐ వల్ల తగ్గిందని గమనించిన సంస్థ తిరిగి ఉద్యోగులను హైర్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. దీనికి ముందు సంస్థ ఏఐ దిగ్గజం ఓపెన్ ఏఐతో జతకట్టిన సంగతి తెలిసిందే.
క్లార్నా ఏఐ మీద నమ్మకంతో 2022లో 5వేల 500గా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2024 నాటికి 3వేల 400కి తగ్గించింది. అంటే ఈ క్రమంలో కంపెనీ దాదాపు 2000వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సీఈవో సెబాస్టియన్ వెల్లడించారు. అయితే తన ఏఐ ప్రణాళిక అనుకున్న స్థాయిలో ఫలితాలను అందించలేకపోయిందని, ఇక్కడ మనుషుల ఆవస్యకతను తాము గుర్తించామని ఆయన వెల్లడించారు. ఖర్చుల తగ్గింపులకు ప్రయత్నించి చివరికి లో క్వాలిటీ సేవలను అందించటం సరికాదని సీఈవో ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. అందుకే తాము తిరిగి మనుషులను హైర్ చేసుకుంటున్నామని, క్వాలిటీని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
►ALSO READ | Gold Rate: తులం రూ.3వేల 800 పెరిగిన గోల్డ్.. ఇలా అయితే హైదరాబాదీలు కొనటం కష్టమే..!!
ఫైనాన్స్ రంగంలో ప్రస్తుతం ఉన్న అధిక పోటీ సమయంలో టెక్నాలజీతో పాటు మనుషుల పాత్రకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగాలని క్లార్నా ప్రయత్నిస్తోంది. దీనిని చూస్తుంటే రానున్న కాలంలో అనేక రంగాల్లోని కంపెనీలు సైతం అధికంగా ఏఐ టెక్నాలజీలపై ఆధారపడటం అనుకున్న ఫలితాలను సాధించిపెట్టలేదని ఇది నిరూపిస్తోంది. ఎంతైనా మనుషుల మాదిరిగా యంత్రాలు, టెక్నాలజీలు ఆలోచించలేవని, మనుషులను అవి పూర్తిగా రీప్లేస్ చేయలేవని ఇది నిరూపిస్తోంది. కానీ ఏఐ ప్రభావం కొంత వరకు అయితే ఉద్యోగాలను ప్రభావితం చేయవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.