కమీషన్లు తగ్గిస్తె ఎట్ల బతకాలె.. స్విగ్గీ డెలివరీ బాయ్స్‌‌ ఆవేదన

కమీషన్లు తగ్గిస్తె ఎట్ల బతకాలె.. స్విగ్గీ డెలివరీ బాయ్స్‌‌ ఆవేదన
  •     ఇన్సెంటివ్స్‌‌, బోనస్‌‌, డిస్టెన్స్ పేమెంట్లూ లేవు
  •     పరిష్కారం కోసం నాలుగు రోజులుగా ఆందోళన
  •     స్పందించని యాజమాన్యం.. నేడూ కంటిన్యూ

గచ్చిబౌలి, వెలుగు: ఏఎస్ రావునగర్‌‌కు చెందిన జగన్ కొన్నేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌‌గా చేస్తున్నాడు. కరోనాకు ముందు ప్రతి నెల 20 వేల వరకు సంపాదించేవాడు. ప్రస్తుతం రూ. 10 వేలు కూడా వస్తలేవని ఆవేదన చెందుతున్నాడు. స్విగ్గీ యాజమాన్యం ఇన్సెంటివ్స్, బోనస్ ఇస్తలేదని, ఆర్డర్‌‌కు మినిమమ్ డబ్బులూ రావట్లేదని చెప్పాడు. నగరంలోని స్విగ్గీ డెలివరీ బాయ్స్ అందరూ ఇవే ప్రాబ్లమ్స్‌‌తో ఇబ్బంది పడుతున్నారు. తమ డిమాడ్లు నెరవేర్చాలంటూ 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ఇన్సెంటివ్స్ ఇస్తలేరు

స్విగ్గీ యాజమాన్యం గతంలో ఒక్కో ఆర్డర్‌‌కు డెలివరీ బాయ్స్‌‌కు రూ. 35 ఇచ్చేది. కానీ ఇప్పుడు రూ. 15కు తగ్గించింది. డెలివరీ కోసం ఎంత దూరం వెళ్లినా కిలోమీటర్‌‌కు రూ. 6 చొప్పునే ఇస్తోంది. కరోనాకు ముందు మంత్లీ ఇన్సెంటివ్స్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఇచ్చేది. ఇప్పుడు అవి లేవు. రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తే రూ. 5 నుంచి రూ. 25 ఇచ్చే యాజమాన్యం ఇప్పుడు ఇవ్వట్లేదని బాయ్స్‌‌ చెబుతున్నారు. రాత్రి 11 తర్వాత ఆర్డర్‌‌కు రూ. 20 ఇచ్చేవారని, ప్రస్తుతం 1 గంట దాటాక రూ. 15 ఇస్తున్నారని తెలిపారు. ప్రతి నెల రూ. 4 వేలు బోనస్ ఇచ్చేవారని, ప్రస్తుతం అలాంటివేం లేవని ఆవేదన చెందుతున్నారు. తమను కాదని థర్డ్ పార్టీకి యాజమాన్యం డెలివరీలు ఇవ్వడంపై బాయ్స్‌‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబం గడుస్తలేదు

చాలా మంది యువకులు చదువుకుంటూ స్విగ్గిలో డెలివరీ బాయ్‌‌గా పార్ట్ టైమ్ పని చేస్తున్నారు. ఫుల్‌‌ టైమ్‌‌ చేస్తున్న వాళ్లూ ఉన్నారు. గతంలో ప్రతి నెల రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు సంపాదించుకునే వాళ్లమని, ఇప్పుడు రూ. 10 వేలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడినా రూ. 600 కంటే ఎక్కువ వస్తలేవని, ఇందులో రూ. 300 పెట్రోల్‌‌కే ఖర్చవుతున్నాయని తెలిపారు. ఇంటి రెంటు, పిల్లల చదువులు, పెరిగిన నిత్యవసరాల ధరలకు ఆ డబ్బు ఎటూ సరిపోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. కుటుంబం గడవడం కష్టమైపోతోందంటున్నారు.

అందరికీ ఒకేలా చెల్లించాలి

తమ డిమాండ్స్‌‌ పరిష్కరించాలంటూ 4 రోజులుగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన చేస్తున్నారు. గతంలో ఇచ్చినట్టు డబ్బులివ్వాలని, అందరికీ ఒకేలా చెల్లించాలని, డైలీ ఇన్సెంటివ్స్, డిస్టెన్స్ పేమెంట్ ఇవ్వాలని డిమాండ్‌‌ చేస్తున్నారు. రెస్టారెంట్ వెయిటింగ్ పేమెంట్ ఇచ్చి టార్గెట్, టైమ్​ లిమిట్ తీసివేయాలన్నారు. శుక్రవారమూ స్విగ్గీ యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో బాయ్స్ తమ ఆందోళన కంటిన్యూ చేయాలని నిర్ణయించారు.