
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌ఫామ్ ఫీజు’ కింద ఆర్డర్‌కు రూ.15ను స్విగ్గీ ఛార్జ్ చేస్తోంది. గడచిన మూడు వారాల వ్యవధిలో స్విగ్గీ ఈ ఫ్లాట్ ఫామ్ ఫీజు పెంచడం మూడోసారి కావడం గమనార్హం. స్విగ్గీలో రోజుకు సగటున 20 లక్షల ఆర్డర్స్ ఉంటున్నాయి.
12 రూపాయలుగా ఫ్లాట్ ఫాం ఫీజు ఉన్నప్పుడు ఈ ఫ్లాట్ ఫాం ఫీజు ద్వారా 2.4 కోట్ల రోజువారీ ఆదాయం పొందిన స్విగ్గీ, 15 రూపాయల చేశాక రోజుకు 3 కోట్ల రూపాయలకు పైగానే ఫ్లాట్ ఫాం ఫీజు రూపంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ లెక్కన త్రైమాసికానికి 54 కోట్లు, వార్షికంగా 216 కోట్ల ఆదాయం స్విగ్గీ ఈ ఫ్లాట్ ఫాం ఫీజు రూపంలోనే పొందే అవకాశం ఉండటం గమనార్హం. ఈ పెరిగిన రేటు కొన్ని ప్రధాన నగరాల్లో అమల్లోకి వస్తుందని స్విగ్గీ ప్రకటించింది.
ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన స్విగ్గీ ఈ ఫ్లాట్ ఫాం ఫీజులను ఏప్రిల్ 2023 నుంచి వినియోగదారులపై మోపింది. తొలుత ఆర్డర్కు 2 రూపాయలుగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా 15 రూపాయల వరకూ పెంచుకుంటూ పోయింది. జొమాటో కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును తాజాగా పెంచింది. 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచింది. 2023 ఆగస్టులో జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులను వేయడం ప్రారంభించింది.
ఫుడ్ ఆర్డర్‌పై వేసే డెలివరీ ఫీజులు, జీఎస్‌టీ, రెస్టారెంట్ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలకు అదనంగా ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు పడుతుంది. మనం చెల్లించే ఈ ప్లాట్ ఫామ్ ఫీజు డైరెక్టుగా సదరు సంస్థలకే వెళ్తుంది. తమపై పడుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకోవటం కోసమే జొమాటో, స్విగ్గీ సంస్థలు ఈ ప్లాన్ వేశాయి.