ఐటీ కంపెనీల బాటలో స్విగ్గీ!

ఐటీ కంపెనీల బాటలో స్విగ్గీ!

ఆర్థిక మాంద్యం భయంతో అనేక దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీ స్విగ్గీ తమ ఉద్యోగుల్లో 8 నుంచి 10 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 6వేల మంది ఉద్యోగులు కలిగిన స్విగ్గీ ఈ ఏడాది చివరి నాటికి 600మంది ఉద్యోగులను తొలగించే అవకాశముందని సమాచారం. 

మరోవైపు స్విగ్గీ నష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2021లో రూ.1,617 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.3,628కోట్లకు చేరాయి. నష్టాలు దాదాపు రెట్టింపు కావడంతో కంపెనీ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. కాస్ట్ కట్టింగ్ లో భాగంగానే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇవ్వాలని స్విగ్గీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్విగ్గీకి పోటీగా ఉన్న జొమాటో కూడా గతేడాది నవంబర్ లో 3శాతం మంది ఉద్యోగులతో పాటు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులను సైతం ఉద్యోగాల నుంచి తొలగించింది.