
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్ బ్రిడ్జ్‌లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్‌లో ఉన్న ఎంఐహెచ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ బీవీకి విక్రయిస్తారు. ఇది ప్రోసస్ గ్రూప్‌లో భాగం. సెబీ రెగ్యులేషన్స్ కింద నమోదు అయిన సెటు ఏఐఎఫ్ ట్రస్ట్‌కు (వెస్ట్‌బ్రిడ్జ్) రూ. 431.49 కోట్లకు 35,958 వాటాలను విక్రయించనుంది.
రాపిడో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న నేపథ్యంలో స్విగ్గీ నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ తన క్విక్ కామర్స్ వ్యాపారం అయిన ఇన్‌స్టామార్ట్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇది కంపెనీకి అనుబంధంగా ఉంటుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ, వనరుల మెరుగైన వినియోగం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరం ఇన్‌స్టామార్ట్ ఆదాయం రూ. 2,129.58 కోట్లు.