ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ 

ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ 

వీడు మాములోడు కాదు. ఎవరైనా అమ్మాయి ఒక్కసారి పరిచయం అయితే చాలు నువ్వే నా ప్రాణం.. నువ్వు లేనిది నేను లేను అని సినిమా డైలాగ్ లు కొడతాడు. తాను ఫేమస్ డాక్టర్ ను అని తెగ బిల్డప్ ఇస్తాడు. మాటమాట కలిపి పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తాడు. అతగాడి మాయమాటలు నమ్మి అనేక మంది అమాయక మహిళలు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ధైర్యంగా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు. 

ఏడురాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న స్వైన్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రాష్ట్రాలకు చెందిన మహిళలతో 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు బిదు ప్రకాష్ అలియాస్ రమేష్ స్వైన్.  ఒడిశా రాష్ట్రం కేంద్రపరా జిల్లాకు చెందిన ఈ మాయలోడు 54 ఏళ్ల వయసులో కూడా నిత్య పెళ్లికొడుకే. తాను ఫేమస్ డాక్టర్ గా నటిస్తూ అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడాడు. ఈజీ మనీ కోసం ఈ కేటుగాడు చేయని జిమ్మిక్కులు లేవు. దాదాపు  పంజాబ్, ఢిల్లీ, అసోం, జార్ఖండ్, ఒడిశాకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేశాడు. మధ్య వయస్కులైన మహిళలు, భర్త నుంచి విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకునేవాడు. బంగారు భవిష్యత్తు కల్పిస్తానని..గొప్ప సంఘ సంస్కర్తగా బిల్డప్ ఇచ్చేవాడు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలో సీనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాని చెప్పేవాడు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ వైబ్ సైట్ల ద్వారా మహిళలను పరిచయం చేసుకుని వారిని తన మాయమాటలతో బురిడీ కొట్టించేవాడు. అది కూడా ఉన్నత విద్యావంతులైన మహిళలు, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసేవారినే ఎంచుకునేవాడు. మోసగాడి మాయమాటలు నిజమే అని నమ్మి వివాహం చేసుకునేవారు. స్వైన్ బాధితుల్లో సుప్రీంకోర్టు న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అధికారిని ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అతగాడి లీలలు ఏ విధంగా ఉండేవో. 

ఆస్పత్రి మంజూరు చేస్తానని మోసం

2018లో పంజాబ్ కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు 10 లక్షల మేర మోసం చేసి ఉడాయించాడు. గురుద్వారాలో ఆస్పత్రి మంజూరు చేస్తానని చెప్పి మరో 11 లక్షలు తీసుకుని చెప్పాపెట్టకుండా చెక్కేశాడు. స్వైన్ కు 1982లో మొదటి సారి వివాహం జరిగింది. తర్వాత 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. 2002 నుంచి 2020 వరకు దాదాపు 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత వారి వద్దనే నమ్మకంగా ఉండేవాడు. తర్వాత వారి లోటుపాట్లను తెలుసుకుని డబ్బులు తీసుకుని పారిపోయేవాడు. పని మీద భువనేశ్వర్ కు వెళ్తానని చెప్పి మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలివెళ్లేవాడు.

టీచర్ ఫిర్యాదుతో స్వైన్ అరెస్ట్ 

జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ ను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తనను స్వైన్ మోసం చేశాడని తెలియడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేటుగాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా విచారణలో నమ్మలేని నిజాలు బయటపడటంతో పోలీసులే విస్తుపోయారు. అతని వద్ద ఉన్న 11 ఏటీఎం కార్డులు, నాలుగు వేర్వేరు అడ్రస్ లతో కూడిన ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 2 కోట్లు స్వాహా

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని లక్షలను కాజేశాడు. ఇదే విషయంపై గతంలో స్వైన్ హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యాడు. సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నటిస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 2 కోట్లు వసూలు చేశాడు. 

మరిన్ని వార్తల కోసం

 

థియేటర్స్ లో కొవిడ్ రూల్స్ పాటించాల్సిందే

కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు