మెదడుతో ఐఫోన్ కంట్రోల్

మెదడుతో ఐఫోన్ కంట్రోల్

చేతులు లేనివాళ్లు, శరీరం పూర్తిగా ప్యారలైజ్ అయినవాళ్లు, పేషెంట్లు పనులు చేయడం కష్టం. అలాంటివాళ్లు కూడా మొబైల్స్ వాడేలా కొత్త పరికరాన్ని తయారుచేసింది సింక్రాన్ కంపెనీ. ఆ పరికరాన్ని ఉపయోగించి మెదడుతో యాపిల్ మొబైల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. న్యూయార్క్‌కు చెందిన సింక్రాన్ సంస్థ "సింక్రాన్ స్విచ్" అనే పరికరాన్ని తయారుచేసింది. రోగులు వాళ్ల మెదడును ఉపయోగించి ఐఫోన్, ఐప్యాడ్‌ను నియంత్రించేలా ఇది పనిచేస్తుంది.

"స్టెంట్రోడ్" అనే సెన్సర్లను రక్తనాళాల ద్వారా మెదడు పైభాగంలోకి పంపిచి ఫిక్స్ చేస్తారు. అది మెదడుతో కనెక్ట్ అవుతుంది. అలా మొబైల్ ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ‘సిరి’ వాయిస్ అసిస్టెంట్ ని ఎలా వాడుతున్నామో, సింక్రాన్ స్విచ్ ని కూడా అలానే వాడొచ్చు. కాకపోతే మెదడు సిగ్నల్స్ ద్వారా. సెన్సర్ కి సంబంధించిన సింక్రోన్ వైర్ లెస్ స్విచ్ ని రోగి ఛాతీ దగ్గర అమర్చుతారు. ఆ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ లా పనిచేస్తుంది. 

సింక్రాన్‌ని ఆరుగురు రోగులకు అమర్చి వాళ్లపై టెస్ట్ చేశారు సైంటిస్ట్ లు. ఆ రోగుల మెదడులో అనుకున్న పనులు డివైజ్ డిటెక్ట్ చేసి మొబైల్ కి పంపుతుంది. ఆ డివైజ్ తో మొబైల్ ద్వారా అనుకున్న పనులు చేస్తున్నారు. సింక్రాన్ స్విచ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి యూఎస్ లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఆమోదం కూడా పొందింది అని చెప్తున్నాడు సింక్రాన్ సీఈఓ వటామ్ ఆక్స్లీ.