బెంగళూరు అడ్డాగా.. నాలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లయ్

బెంగళూరు అడ్డాగా.. నాలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లయ్

హైదరాబాద్, వెలుగు:  బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇంటర్నేషనల్ నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్ ను టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) పట్టుకుంది. ఆరుగురిని అరెస్ట్ చేయగా.. వీరిలో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. వీరి నుంచి రూ. కోటి విలువైన 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎండీఎంఏ, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడు. ఈ గ్యాంగ్ వివరాలను టీ న్యాబ్ డైరెక్టర్, సిటీ సీపీ ఆనంద్ శుక్రవారం వెల్లడించారు.

మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చి.. 

నైజీరియాకు చెందిన అగ్బోవో మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ నన్‌‌‌‌‌‌‌‌బుహ్షి 2011లో మెడికల్ వీసాపై ఇండియా వచ్చాడు. ముంబయిలో ఉండేవాడు. స్థానికంగా డ్రగ్‌‌‌‌‌‌‌‌ సప్లయ్ చేసేవాడు. ముంబయి పోలీసులు నిఘా పెట్టడంతో  బెంగళూరుకు మకాం మార్చాడు. కెవ్క్‌‌‌‌‌‌‌‌ ఇస్సుమాన్‌‌‌‌‌‌‌‌ క్వామెగా పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదే పేరుతో ఫేక్ పాస్‌‌‌‌‌‌‌‌పోర్టు, వీసాలు సృష్టించాడు. అగ్బోవో ఫేక్ సర్టిఫికెట్లతో బెంగళూర్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎస్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఓ ఇంటిని రెంట్‌‌‌‌‌‌‌‌కు తీసుకున్నాడు.ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా కోసం ఇంటర్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌ కనెక్షన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. బెంగుళూర్‌‌‌‌‌‌‌‌లో ఉండే నైజీరియన్‌‌‌‌‌‌‌‌ మాజీ అనే వ్యక్తి అగ్బోవ్​కు సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్ అమ్మేవారు. అచ్యుతనగర్‌‌‌‌‌‌‌‌లోని కాలేజీలు,యూనివర్సిటీలకు చెందిన స్టూడెంట్లను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసి డ్రగ్స్ సప్లయ్ చేసేవారు.

కోయంబత్తూర్​లో బ్యాంక్ అకౌంట్..

పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు వర్చువల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌(వాయిస్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌)తో అగ్బోవ్, మాజీ ఇద్దరూ డ్రగ్స్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసేవారు. డెడ్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ పద్దతిలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ జరిగేది. అమౌంట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్స్‌‌‌‌‌‌‌‌ కోసం నైజీరియాకు చెందిన ఎవ్విలైన్‌‌‌‌‌‌‌‌ యెరెంకీవా అనే మహిళ పేరుతో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌లోని ఓ నేషనల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో అకౌంట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేశారు. కొంతకాలం తర్వాత అగ్బోవ్, మాజీ తమ డ్రగ్స్ దందాను విస్తరించారు. 2012లో బిజినెస్‌‌‌‌‌‌‌‌ వీసాపై వచ్చి తమిళనాడులో ఉంటున్న  ఓకీకె చింగ్జ్యూ బ్లెసింగ్‌‌‌‌‌‌‌‌, 2021లో స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ వీసాపై వచ్చిన ఐకమ్‌‌‌‌‌‌‌‌ అస్టిన్‌‌‌‌‌‌‌‌ ఓబాక అలియాస్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌స్లేతో కలిసి డ్రగ్స్ సప్లయ్ మొదలుపెట్టారు. వీరిద్దరితో పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని  శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన సాయి ఆకాష్‌‌‌‌‌‌‌‌, మణికొండకు చెందిన తుమ్మభాను తేజారెడ్డి, కేరళకు చెందిన సంజయ్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ.. నాలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందాను కొనసాగించారు.

ఇలా దొరికారు..

గతంలో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్ సప్లయ్ చేస్తూ సంజయ్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌,  భానుతేజారెడ్డి పోలీసులకు చిక్కారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారంతో టీన్యాబ్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలోని ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 2 నెలలుగా నైజీరియన్ గ్యాంగ్ పై నిఘా పెట్టింది. మిగతా నిందితులు అగ్బోవో, ఓకీకే చింగ్జ్యూ, ఐకమ్ అస్టిన్ ఓబాక, సాయి ఆకాశ్ ను అదుపులోకి తీసుకుంది. ఈ గ్యాంగ్ కు సంబంధించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు మాజీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ కు చెందిన ఐకమ్ అస్టిన్ ఓబాకతో పాటు ఘనా దేశానికి చెందిన ఫెలిక్స్ అవోన్యోను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఫెలిక్స్ కు డ్రగ్స్ దందాతో సంబంధం లేదని గుర్తించి అతడిని సొంత దేశానికి డిపోర్ట్ చేస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. నైజీరియన్ గ్యాంగ్ అకౌంట్లలో 6 నెలల వ్యవధిలో రూ.4 కోట్ల ట్రాన్జాక్షన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. వీటిలో హైదరాబాద్ నుంచి జరిగిన డిపాజిట్ల  ఆధారంగా డ్రగ్స్ కస్టమర్లరు గుర్తిస్తామని ఆయన చెప్పారు. 

నేరస్తుల కోసం  నైజీరియన్ల సహాయ నిధి

దేశవ్యాప్తంగా డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, ఇతర కేసుల్లో పట్టుబడేవారి కోసం నైజీరియన్లు ప్రత్యేక సహాయనిధి ఏర్పాటు చేసుకున్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను తయారు చేసుకొని, ఎవరైనా అరెస్ట్‌‌‌‌‌‌‌‌ అయితే వారికి కావాల్సిన న్యాయ,ఆర్ధిక సహాయాన్ని ఈ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ద్వారా అందిస్తున్నారు. ఒక వ్యవస్థీకృత పద్దతిలో నేరాలు చేస్తున్నప్పటికీ ఈ విషయం మొదటి సారిగా బయటపడింది. రెండు నెలల్లో ఈ గ్రూప్‌‌‌‌‌‌‌‌ సహాయనిధి కింద రూ. 8.5లక్షలు జమ చేసినట్లు పోలీసులు గుర్తించారు.