ముషీరాబాద్, వెలుగు: సమగ్ర భూ సర్వే నిర్వహించి, ధరణిలోని లోపాలను సవరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. ధరణిలోని లోపాలను సరిచేసి, భూమాత పథకాన్ని రైతులకు అందుబాటులోకి తేవాలని కోరారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, డబుల్ బెడ్రూమ్ఇండ్లు, ప్రాజెక్టులు, రహదారుల పేరుతో నష్ట పరిహారం ఇవ్వకుండానే పేదల భూములను గత ప్రభుత్వం గుంజుకుందని చెప్పారు. అధికారుల తప్పులతో లక్షలాది మందికి పట్టాదార్పాస్పుస్తకాలు రాలేదని తెలిపారు. సమస్య ఉన్న ప్రతి రైతు సివిల్ కోర్టుకు వెళ్లడం సాధ్యం కాదని, రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
