ఆట ఇక సూపర్​: నేటి నుంచి సూపర్‌‌-12 మ్యాచ్‌‌లు 

ఆట ఇక సూపర్​: నేటి నుంచి సూపర్‌‌-12 మ్యాచ్‌‌లు 
  • ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా మ.3.30 నుంచి
  • ఇంగ్లండ్‌‌ X వెస్టిండీస్‌‌ రా. 7.30 నుంచి

అబుదాబి: టీ20 వరల్డ్‌‌కప్‌‌లో అసలు సిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు రౌండ్‌‌–1 మ్యాచ్‌‌లతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మెగా టోర్నీలో శనివారం నుంచి సూపర్‌‌–12 మ్యాచ్‌‌లు జరగనున్నాయి. రౌండ్​1 నుంచి వచ్చిన నాలుగు జట్లతో పాటు వరల్డ్‌‌ టాప్‌‌–8 టీమ్స్​లో వరల్డ్‌‌ వైడ్‌‌గా జరిగే షార్ట్‌‌ ఫార్మాట్‌‌ లీగ్స్‌‌ను శాసిస్తున్న హార్డ్‌‌ హిట్టర్లందరూ బరిలోకి దిగుతుండటంతో ధనాధన్‌‌ షాట్లతో అరబ్‌‌ గడ్డ హోరెత్తనుంది. ఓవరాల్‌‌గా ఐపీఎల్‌‌కు ఏమాత్రం తగ్గకుండా తమ ఆటతో, పోటీతో జోష్‌‌ పెంచేందుకు క్రికెటర్లు రెడీ అయ్యారు. 
రెండు గ్రూప్‌‌లుగా..
సూపర్‌‌–12లో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌‌లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. గ్రూప్‌‌–1లో ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌‌తో పాటు రౌండ్​1 నుంచి వచ్చిన శ్రీలంక, బంగ్లాదేశ్‌‌ ఉన్నాయి. గ్రూప్‌‌–2లో ఇండియా, పాకిస్తాన్‌‌, న్యూజిలాండ్‌‌, అఫ్గానిస్తాన్‌‌తో పాటు రౌండ్​1 నుంచి క్వాలిఫై అయిన చిన్న జట్లు  నమీబియా, స్కాట్లాండ్‌‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రతి గ్రూప్‌‌లో టాప్‌‌–2లో నిలిచిన జట్లు నాకౌట్‌‌ (సెమీస్‌‌) దశకు అర్హత సాధిస్తాయి. నవంబర్‌‌ 10, 11న సెమీఫైనల్స్​,  14న జరిగే మెగా  ఫైనల్​తో టోర్నీ ముగుస్తుంది.
ఆసీస్‌‌ ఏం చేస్తుందో..?
శనివారం జరిగే ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా... సౌతాఫ్రికాతో తలపడుతుంది. వరల్డ్‌‌ క్రికెట్‌‌ను శాసించి వన్డేల్లో ఐదుసార్లు వరల్డ్‌‌కప్‌‌ నెగ్గిన చరిత్ర.. లెక్కలేనంత మంది షార్ట్‌‌ ఫార్మాట్‌‌ హార్డ్‌‌ హిట్టర్లు అందుబాటులో ఉన్నా.. ఇప్పటివరకు ఆసీస్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ను గెలవలేదు. ఈ నేపథ్యంలో.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌‌లో గెలవడం ఆస్ట్రేలియాకు అంత ఈజీ కాకపోవచ్చు. ఓపెనర్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌తో సహా టాప్‌‌ ఆర్డర్‌‌ మొత్తం ఫామ్‌‌లేమితో ఇబ్బంది పడుతోంది. బంగ్లాదేశ్‌‌, వెస్టిండీస్‌‌, న్యూజిలాండ్‌‌, ఇంగ్లండ్‌‌, ఇండియాతో జరిగిన బైలేటరల్‌‌ సిరీస్‌‌ల్లో పరాజయాలతో ఆసీస్‌‌ ఈ టోర్నీలోకి అడుగుపెట్టింది. దీంతో పాటు రెండు వామప్‌‌ మ్యాచ్‌‌ల్లోనూ ఓడింది. ఫలితంగా కంగారూలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. మోకాలి సర్జరీ చేయించుకున్న ఫించ్‌‌కు సరైన ప్రాక్టీస్‌‌ లేదు. మిడిలార్డర్‌‌లో స్టీవ్‌‌ స్మిత్‌‌, స్టోయినిస్‌‌ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. మ్యాక్స్‌‌వెల్‌‌, మిచెల్‌‌ మార్ష్‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. మ్యాచ్‌‌ విన్నర్లుగా మారాలి. అయితే ఆసీస్‌‌కు బలమైన బౌలింగ్ డెప్త్‌‌ ఉండటం కలిసొచ్చే అంశం. స్పిన్నర్లుగా జంపా, అగర్‌‌.. యూఏఈ పిచ్‌‌లపై కీ రోల్‌‌ పోషించనున్నారు. పేసర్లు కమిన్స్‌‌, స్టార్క్‌‌, రిచర్డ్‌‌సన్‌‌, హాజిల్‌‌వుడ్‌‌ చెలరేగితే గెలుపు ఖాయం. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఫస్ట్‌‌ టైటిల్‌‌ కోసం వేట మొదలుపెడుతున్నా.. టోర్నీకి ముందు వరుసగా వెస్టిండీస్‌‌, ఐర్లాండ్‌‌, శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌‌ల్లో గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఇక రెండు ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ల్లోనూ ప్రొటీస్‌‌ జట్టే గెలిచింది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించలేదనే అపవాదు సౌతాఫ్రికాపై ఎప్పటి నుంచో ఉంది. ఈసారి ఆ ట్యాగ్‌‌ను తుడిచిపెట్టి టైటిల్‌‌ను గెలుస్తారా? చూడాలి. సఫారీ టీమ్‌‌లో బవూమ, డికాక్‌‌, మార్‌‌క్రమ్‌‌, రెజా హెండ్రిక్స్‌‌ ఓపెనింగ్‌‌ కోసం రెడీగా ఉన్నారు. అయితే బిగ్‌‌ హిట్టర్‌‌ డేవిడ్‌‌ మిల్లర్‌‌ ఫామ్‌‌ ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌‌లో రబాడ, ఎంగిడి, నోర్జ్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. స్పిన్నర్లు షంసి, కేశవ్‌‌ మహరాజ్‌‌ స్పిన్‌‌ బాధ్యతలను మోయనున్నారు. మరి, ఆసీస్‌‌ను నిలువరించి సఫారీలు బోణీ చేస్తారా? చూడాలి.
ఇంగ్లండ్‌‌ను ఆపతరమా?
 గ్రూప్​–లో భాగంగా జరిగే మరో మ్యాచ్​లో రెండు డుసార్లు చాంపియన్‌‌ అయిన వెస్టిండీస్‌‌.. బలమైన ఇంగ్లండ్‌‌ను  డీకొట్టనుంది. టీ20లకు ప్రత్యామ్నాయంగా మారిన హిట్టర్లతో విండీస్‌‌ కళకళలాడుతోంది. అయితే రెండు వామప్‌‌ గేమ్‌‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఛేజ్‌‌, పొలార్డ్‌‌, గేల్‌‌, లూయిస్‌‌, సిమన్స్‌‌, హెట్‌‌మయర్‌‌, పూరన్‌‌లో ఒక్కరు నిలబడినా భారీ స్కోరు ఖాయం. రసెల్‌‌ ఫిట్‌‌నెస్‌‌పై ఆందోళన కొనసాగుతోంది. ఇక లాస్ట్‌‌ ఎడిషన్‌‌ ఫైనల్లో విండీస్‌‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లండ్‌‌ భావిస్తోంది. కీలకమైన బెన్‌‌ స్టోక్స్‌‌, ఆర్చర్‌‌, సామ్‌‌ కరన్‌‌ లేకపోయినా ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ బ్యాలెన్స్‌‌గా ఉంది. రాయ్‌‌, బెయిర్‌‌స్టో, బట్లర్‌‌, మోర్గాన్‌‌పై బ్యాటింగ్‌‌ ఆధారపడి ఉంది. బౌలింగ్‌‌లో డేవిడ్‌‌ విల్లే, క్రిస్‌‌ వోక్స్‌‌, అలీ కీలకం కానున్నారు.