
ఆగ్రా: ప్రపంచ వింతల్లో ఒకటి, ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌ను తాత్కాలికంగా మూసేశారు. గురువారం ఉదయం బాంబు బెదిరింపులు రావడంతో తాజ్‌మహల్‌ను మూసేశారు. ఐకానిక్ ప్రదేశమైన తాజ్‌మహల్‌లో పేలుడు పదార్థాలను ఉంచినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ అధికారులు తాజ్‌మహల్ పరిసరాల్లో ముమ్మురంగా చెకింగ్స్ చేస్తున్నారు. ‘ఇవ్వాళ ఉదయం యూపీ 112 నంబర్‌కు ఎవరో అపరిచితుడి నుంచి కాల్ వచ్చింది. తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని, బాంబ్ బ్లాస్ట్ చేస్తామని అతడు బెదిరించాడు. దీంతో వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్ అక్కడికి చేరుకొని గాలింపులు చేస్తోంది’ అని ఆగ్రా ఇన్స్‌పెక్టర్ జనరల్ సతీష్ గణేష్ అన్నారు. టూరిస్టులను పంపేశామని, ఎవరినీ రానివ్వడం లేదని స్పష్టం చేశారు.