న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో వాస్తవ విరుద్ధమైన, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఇస్తామని తప్పుడు వాగ్దానం చేసిందని చెప్పారని ఆయన ధ్వజమెత్తారు. ఒంటరిగా పోటీ చేసిన 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిందన్న ప్రధాని మోదీ వాదనను ఆయన తప్పుపట్టారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పెరిగిందని ఠాగూర్ లేఖలో పేర్కొన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ హయాంలో సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదన్న మోదీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేవలం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత మాత్రమే ఉండేదని, పూర్తిగా జాకెట్లు లేవనడం సరికాదని తెలిపారు. పోలీసుల వద్ద కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. సైన్యానికి కాంగ్రెస్ యుద్ధ విమానాలు కూడా ఇవ్వలేదన్న వాదననూ ఆయన తోసిపుచ్చారు.
అప్పుడు ఆర్మీ వద్ద జాగ్వార్, మిగ్ 29, ఎస్యూ- 30, మిరాజ్ 2000 వంటి యుద్ధ విమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 1న లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంలోనూ తప్పులు ఉన్నాయని మాణిక్కం ఎత్తి చూపారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినప్పుడు ఆర్మీకి ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇవ్వలేదని ఠాకూర్ పేర్కొన్నారని అన్నారు. కానీ ఆర్మీ వద్ద అణుబాంబులు, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఉన్నాయని వివరించారు.
