దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోండి: హైకోర్టు

దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలు తొలగించి, మురికి కూపం కాకుండా చూడాలని చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలను తప్పకుండా అమలు చేయాలనింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 78 నిర్మాణాలు, బఫర్‌ జోన్‌లో అక్రమంగా నిర్మించిన 146 నిర్మాణాల తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. 

160.6 ఎకరాల విస్తీర్ణంలో ఎఫ్‌టీఎల్‌ సరిహద్దును ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ తుది నోటిఫికేషన్‌ ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్‌ రిపోర్టుపై అసంతప్తిని వ్యక్తం చేసింది. దుర్గం చెరువు రక్షణ చర్యల తర్వాత మరోసారి నిపుణుల కమిటీ చెరువును పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది. దుర్గం చెరువులో కాలుష్యం చేరి పెద్ద సంఖ్యలో చేపలు చచ్పిపోతున్నాయంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో  గా తీసుకుని విచారిస్తోంది. తదుపరి విచారణను  ఈ నెల 11కు వాయిదా వేసింది.