నిజామాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: అర్వింద్

నిజామాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: అర్వింద్

నిజామాబాద్ ప్రజలను  తప్పుదోవ పట్టించే పని  జరుగుతోంది… పపుసు బోర్డు విషయంలో  అబద్దాల ప్రచారం సాగుతోందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి. నిజామాబాద్ లో రైతులు తీవ్రంగా వ్యతిరేంకగా ఉండటం, ఓటమి భయంతో  సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అసత్యాల ప్రచారం చేస్తోందన్నారు. ఐదేళ్ళు మీ మాటలు నమ్మి మోసపోయిన రైతన్నలు , మహిళలను మళ్లీ మోసం చేద్దామనుకున్నా ఇప్పుడు  ఎవరూ నమ్మబోరన్నారు అర్వింద్.

జాతీయ మేనిఫెస్టో విధివిధానాలకు సంబంధించిన పాలసీ విధాలను మాత్రమే పొందుపరుస్తారు తప్ప ప్రతీ రాష్ట్రంలో ఉన్న, లేదా ఆయా ప్రాంతాలలో ఉండే ప్రతీ పంట పేరును అందులో పొందుపరచరన్నారు అర్వింద్. బీజేపీ అధికారంలోకి రాగానే,  నిజామాబాద్ లో బీజేపీ ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకువస్తామన్నారు. ఈ విషయాన్ని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్ నాథ్ సింగ్ చాలా స్పష్టంగా నిజామాబాద్ బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం, బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు. వ్యవసాయ రంగానికి 25 లక్షల కోట్లు కేటాయిస్తామని మాట ఇచ్చామంటనే… రైతుల పట్ల తమకు ఉన్నచిత్తశుద్ది అర్థమవుతోందన్నారు.  కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశంలో ఉన్న రైతులు అందరికీ  ఏడాదికి   6,000 రూపాయలు సాయం చేయాలని నిర్ణయించామన్నారు. 60 ఏళ్లు నిండిన సన్న, చిన్న కారు రైతులకు ఫించన్,  కిసాన్ క్రెడిట్ కార్డు పై సున్నా వడ్డీతో  లక్ష రూపాయల రుణం లాంటి వరాలు ఇచ్చింది బీజేపీయేనన్నారు.  ఇక పసుపు బోర్డు అనేది మన నిజామాబాద్ లో మాత్రమే అవసరం కాబట్టి స్వయంగా రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన తర్వాత  ఎలాంటి ఆందోళన, అనుమాన పడాల్సిన అవరసం లేదన్నారు అర్వింద్.

ఎన్నికల్లో గెలిచిన వెంటనే పసుపుబోర్డు తీసుకువస్తా.. లేదంటే రాజీనామా చేసి రైతులతో పాటు పోరాటం చేస్తాని స్పష్టం చేశారు అర్వింద్  ధర్మపురి.