ముంబై: అమెరికా నుంచి మనదేశానికి మరోసారి టారిఫ్ ల ముప్పు పొంచి ఉండటం, వెనెజువెలాపై యూఎస్ దాడుల వల్ల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టపోయాయి. బ్లూ చిప్ కంపెనీలు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ సంస్థల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు కిందకు జారాయి. 30 షేర్ల బీఎస్ ఈ సెన్సెక్స్ 322.39 పాయింట్లు తగ్గి 85,439.62 వద్ద స్థిరపడింది.
ఒక దశలో ఇది 446.68 పాయింట్లు (0.52 శాతం) పతనమై 85,315.33 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. బీఎస్ ఈ లో మొత్తం 2,545 షేర్లు నష్టాల్లో ముగియగా, 1,723 షేర్లు లాభపడ్డాయి. మిగతా 203 షేర్ల ధరలు మారలేదు. నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలో 26,373.20 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకినా, తరువాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. చివరికి 78.25 పాయింట్లు (0.30 శాతం) నష్టపోయి 26,250.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను సంపాదించాయి. ఐటీ షేర్లలో విక్రయాలు పెరగడం, అంతర్జాతీయ ఆందోళనలు మదుపర్ల ఉత్సాహాన్ని తగ్గించాయి. బీఎస్ ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం, మిడ్ క్యాప్ సూచీ 0.05 శాతం పెరిగాయి.
సెక్టోరల్ సూచీలకూ నష్టాలు
బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఐటీ 1.37 శాతం పడిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ 1.18 శాతం, ఎనర్జీ 0.95 శాతం, టెలికమ్యూనికేషన్ 0.81 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.25 శాతం నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ మాత్రం 2.16 శాతం జంప్ చేసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.25 శాతం, మెటల్ 0.58 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.51 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.40 శాతం పెరిగాయి. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ లు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి.
రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రష్యా చమురును కొనే దేశాల దిగుమతులపై 500 శాతం సుంకాలు విధించేలా అమెరికాలో ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ పెంచాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం రూ.289 కోట్లు విలువైన షేర్లను, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.677 కోట్లు విలువైన షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 60.67 డాలర్ల వద్ద ఉంది.
