టీవీల్లో మ్యూజిక్‌, లేడీ వాయిస్‌లు బ్యాన్‌ చేసిన తాలిబాన్‌

టీవీల్లో మ్యూజిక్‌, లేడీ వాయిస్‌లు బ్యాన్‌ చేసిన తాలిబాన్‌

కాందహార్‌: అఫ్గాన్‌లో తాలిబాన్ అరాచకాలు క్రమంగా పెరుగుతున్నాయి. 1990ల్లో అఫ్గాన్‌లో తమ పాలన నడిచిన సమయంలో ఆడవాళ్ల హక్కులను అణచివేసి, వారు చదువుకోకూడదని, ఉద్యోగాలు చేయకూడదని శాసనం చేసి తాలిబాన్లు మళ్లీ ఇప్పుడు అదే దారిలో అడుగులు వేస్తున్నారు. మాట ఇచ్చిన దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్‌ను ఆగస్టు 15న పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్న తాలిబాన్లు ఈసారి ఆడవాళ్లు చదువుకోవచ్చని, వాళ్లు ఉద్యోగాలు చేయొచ్చని, ఇందుకు తాము అనుమతిస్తున్నామని హామీ ఇచ్చారు. కానీ చర్యలు మాత్రం రివర్స్‌లో ఉన్నాయి. లోకల్ టీవీ చానెల్స్‌లో పని చేసే లేడీ యాంకర్లు, న్యూస్ రీడర్లపై నిషేధం విధించారు. ఇప్పటికే అనేక సోషల్ మీడియా చానెళ్లలో పని చేసే మహిళా ఉద్యోగులను పూర్తిగా తొలగించారు. 

ప్రస్తుతం తాజాగా కాందహార్‌‌ సిటీలోని టీవీ చానెళ్లు, రేడియోల్లో మ్యూజిక్‌తో పాటు లేడీ వాయిస్‌లు కూడా వినిపించడానికి లేదని తాలిబాన్లు హుకుం జారీ చేశారు. దీంతో ఆయా సంస్థల యాజమాన్యాలు పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇన్నాళ్లు తమ సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటున్న అనేక మంది మహిళలు ఇకపై తీవ్ర ఇబ్బందులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.