
రజినీకాంత్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘అన్నాత్తే’ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో తర్వాతి చిత్రం ఎంపిక విషయంలో కొంత గ్యాప్ తీసుకున్న తలైవా.. ఫైనల్‌గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జైలర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు నిన్న ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రక్తసిక్తమైన ఓ పెద్ద కత్తి ఇనుప గొలుసుకు వేలాడదీసి ఉంది.
అలా పోస్టర్‌తోనే ఇదో యాక్షన్ మూవీ అనే హింటిచ్చారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రంలో రజినీ జైలర్‌గా కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జులైలో షూటింగ్ మొదలవనుంది. ఇక కో కో కోకిల, డాక్టర్ చిత్రాలతో మెప్పించిన దర్శకుడు నెల్సన్, ఇటీవల విజయ్‌తో తీసిన ‘బీస్ట్’ చిత్రం నిరాశపర్చింది. అయినప్పటికీ తన టాలెంట్‌పై నమ్మకంతో అవకాశమిచ్చారు రజినీ. మరి తలైవా నమ్మకాన్ని నెల్సన్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి!