ఉక్రెయిన్​ సంక్షోభానికి చర్చలే పరిష్కారం: ప్రధాని మోడీ

ఉక్రెయిన్​ సంక్షోభానికి చర్చలే పరిష్కారం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:   ఉక్రెయిన్​ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని.. ఆ దిశగా జరిగే శాంతి ప్రక్రియలో తనవంతు పాత్రను పోషించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కరోనా, ఉక్రెయిన్​ సంక్షోభాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, కొత్త సమస్యలను సృష్టించాయని.. వాటి పరిష్కారానికి దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇండియా చేరుకున్న జర్మనీ చాన్స్​లర్​ ఒలాఫ్ స్కోల్జ్​తో కలిసి ప్రధాని మోడీ ఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘యూరప్​ లో ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ.. భారత్​లో గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లోనూ జర్మనీ ముఖ్యమైంది”అని ప్రధాని చెప్పారు. మేక్​ ఇన్​ ఇండియా, ఆత్మనిర్భర్​ భారత్​ ద్వారా భారత్​లోని అన్ని రంగాల్లో కొత్తగా ఏర్పడుతున్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని జర్మనీ చాన్స్​లర్​ను కోరారు.  వేర్పాటువాదం, టెర్రరిజం విషయంలో ఇండియా, జర్మనీ పరస్పరం సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి ఏడాది పూర్తయిన తరుణంలో ఈ  మీటింగ్​ జరిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్​ అంశంపై మోడీ, స్కోల్జ్ ప్రధానంగా చర్చించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్​కు చేరుకున్న జర్మనీ చాన్స్​లర్​కు ప్రధాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేఘాలయ, నాగాలాండ్​ శాలువాలను ఆయనకు బహూకరించారు. అనంతరం వారిద్దరు కలిసి హైదరాబాద్​ హౌస్​కు చేరుకొని చర్చలు జరిపాక మీడియాతో మాట్లాడారు. 

ప్రపంచ దేశాలకు నష్టం: జర్మనీ చాన్స్ లర్​ 

ఉక్రెయిన్​పట్ల రష్యా దుందుడుకు చర్యల పర్యవసానాలను యావత్​ ప్రపంచ దేశాలు అనుభవిస్తున్నాయని ఒలాఫ్ స్కోల్జ్​ వ్యాఖ్యానించారు. ఈ విధంగా హింసాత్మక పద్ధతుల ద్వారా దేశాల సరిహద్దులను మార్చేయలేరనే విషయాన్ని రష్యా ఇప్పటికైనా గ్రహించాలన్నారు. ఉక్రెయిన్​లో జరుగుతున్న యుద్ధాన్నిమహా విపత్తుగా అభివర్ణించారు.

రేపు కర్నాటకకు మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కర్నాటకలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రానున్న ప్రధాని.. శివమొగ్గ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో శివమొగ్గ, బెళగావి జిల్లాల్లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ ప్రాజెక్టులు, రైల్వేలు, రోడ్డు ప్రాజెక్టులు, జల్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ కింద విలేజ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్టివిటీ ప్రాజెక్టులతో సహా పలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌ 13వ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తారు. రూ.450 కోట్లతో శివమొగ్గ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. అదే జిల్లాలో రెండు రైల్వే ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.990 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ కొత్త లైన్‌‌‌‌‌‌‌‌తో.. మాల్నాడు, బెంగళూరు, ముంబై మధ్య కనెక్టివిటీ పెరగనుంది. శివమొగ్గలో రైల్వే కోచింగ్‌‌‌‌‌‌‌‌ డిపోకు రూ.100 కోట్లు, జల్‌‌‌‌‌‌‌‌జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ కింద రూ.950 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి, మరో రూ.895 కోట్లతో 44 స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.