
బాసర IIIT విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రెండుగంటల పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తమ హామీలపై స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి. అయితే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం చర్చలు సఫలం అయ్యాయని, దాదాపు అన్ని డిమాండ్లు ఒప్పుకున్నామని చెప్పారు. సోమవారం (జూన్ 20) నుంచి క్లాసులకు వెళ్తామని విద్యార్థులు ఒప్పుకున్నారని తెలిపారు. వీసీ నియామకంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తమ డిమాండ్లపై సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ కావాలని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్లను ఎప్పటివరకు నెరవేరుస్తారో స్పష్టత ఇస్తే తప్ప ఆందోళన విరమించబోమంటున్నారు. గతంలో ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు కాలేదని, ప్రస్తుతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చర్చల తర్వాత కూడా వర్షంలోనే ఆందోళన కొనసాగించారు విద్యార్థులు.
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమింపజేసేందుకు అధికారులు అన్ని అస్త్రాలు వాడుతున్నారు. క్యాంపస్ లో క్యాంటిన్ HODగా ఉన్న ISR శాస్త్రి విద్యార్థులకు నచ్చజెపుతున్నట్లు మాట్లాడుతూనే.. బెదిరింపులకు పాల్పడిన వీడియో ఒకటి బయటికొచ్చింది. పెద్దాయన చెప్పింది తలకెక్కకుంటే ఏం జరుగుతుందో త్వరలో తెలుస్తుందనటం వైరల్ గా మారింది.
బాసర IIIT విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ పై విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని ట్వీట్ చేశారు. ఎండలో, వానలో విద్యార్థులు కూర్చోవడం మంత్రిగానే కాకుండా.. ఒక అమ్మగా బాధేస్తుందన్నారు. ‘ఇది మీ ప్రభుత్వం. దయచేసి చర్చించండి. ఆందోళన విరమించండి. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు జరగకపోవడంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చన్నారు. సమస్యలు పరిష్కారం కోసం డైరెక్టర్ ను నియమించామని ట్వీట్ చేశారు.