V6 News

15 రోజుల్లో చర్చలకు పిలవాలి.. లేకుంటే మళ్లీ సమ్మెకు దిగుతం: జీపీ కార్మికులు

15 రోజుల్లో చర్చలకు పిలవాలి.. లేకుంటే మళ్లీ సమ్మెకు దిగుతం: జీపీ కార్మికులు

జీపీ కార్మికుల సమ్మె విరమణ
సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హరీశ్, దయాకర్ రావు హామీ
ఎన్నికల భయంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని జీపీ కార్మికుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం గత నెల 6 నుంచి సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలు, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమిస్తున్నామని తెలిపారు. సమ్మె విరమణపై బుధవారం జిల్లా కలెక్టర్లు, డీపీవోలను కలిసి రాతపూర్వకంగా తెలియజేస్తామన్నారు. 


మంగళవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  జేఏసీలోని సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్ టీయూ  సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించాయి. సమ్మె విరమిస్తున్నట్లు భేటీ అనంతరం జేఏసీ చైర్మన్  పాలడుగు భాస్కర్ వెల్లడించారు. సోమవారం జరిగిన చర్చల్లో ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళతామని మంత్రులు హరీశ్  రావు, దయాకర్ రావు చెప్పారని, మిగతా అంశాల పరిష్కారంపైనా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి 15 రోజులు టైం ఇస్తున్నామని, అప్పటిలోగా మంత్రులు తమను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. లేకపోతే మళ్లీ సమ్మెకు వెళ్తామని, ఈ మేరకు జేఏసీలో తీర్మానించామని వివరించారు. 


మంత్రులు హామీ ఇవ్వడంతోనే జేఏసీలో చర్చించి సమ్మె విరమణపై నిర్ణయం తీసుకున్నామని భాస్కర్  వెల్లడించారు. ఐఎఫ్ టీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, జేఏసీ అడ్వైజర్  సూర్యం మాట్లాడుతూ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ సమ్మె సెగ తగిలిందని, అందుకే ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మొదట్లో మంత్రి దయాకర్  రావు కార్మికులను సరిగా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున 50 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు కలిపి 5 లక్షలకు పైగా ఓట్లు ఉంటాయని, సమస్యలు పరిష్కరించకపోతే వ్యతిరేకంగా ఓటు వేస్తారని అధికార పార్టీ గ్రహించిందన్నారు. 


సీఎం సైతం అసెంబ్లీలో తమ సమ్మెపై మాట్లాడారని చెప్పారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సగం మంది ఎమ్మెల్యేలు పంచాయతీ కార్మికుల సమ్మె న్యాయమైనదని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారని, ఇందుకు జేఏసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.