పులుసు అదిరింది...టెస్ట్ ఇంకా అదురుతుంది

పులుసు అదిరింది...టెస్ట్ ఇంకా అదురుతుంది

ఈ సీజన్​లో గ్రేవీ కర్రీలకంటే నీళ్లలా ఉండే చారు, పుల్లటి పులుసు తినాలి అనిపిస్తుంటుంది. ప్రతి ఇంట్లో పచ్చిపులుసు, మిరియాల రసం వంటివి తప్పకుండా ఉంటాయి. నాన్​వెజ్​ ప్రియులైతే చేప, కోడి పులుసు వంటివి ప్రిపేర్​ చేస్తుంటారు. ఇవన్నీ రెగ్యులర్​గా చేసుకునేవే. ఇవికాకుండా వెరైటీగా పచ్చి మామిడికాయ, చింతపండు – మెంతులు, వంకాయ – పల్లీలు, ఉల్లికాడలతో పులుసు పెడితే! ఇవేకాకుండా కరివేపాకుతో కూడా పులుసు పెట్టేస్తే? టేస్ట్​ అదిరిపోతుంది. అందుకే ఈ కొత్త రుచులతో పులుసులు చేయడం షురూ చేసేయండి.–

చింతపండు - మెంతి పులుసు

కావాల్సినవి :

చింతకాయలు – పావు కిలో
పచ్చిమిర్చి – రెండు
మెంతులు – ఒకటిన్నర స్పూన్
శనగపప్పు – పావు కప్పు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
కరివేపాకు – కొంచెం
ఉప్పు – సరిపడా

తయారీ :

ఒక గిన్నెలో నీళ్లు పోసి చింతకాయల్ని కాసేపు ఉడికించాలి. తర్వాత వాటిని  మెదిపి, నీళ్లను వడకట్టాలి. పాన్​లో మెంతులు, శనగపప్పు విడివిడిగా వేగించాలి. చల్లారాక ఆ రెండింటినీ మిక్సీ పట్టి పొడి పట్టాలి. ఈ పొడిలో నీళ్లు కలిపి దోశపిండిలా చేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేగించాలి. అందులో మధ్యకు చీరిన పచ్చిమిర్చి వేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కలపాలి. చింతపండు పులుసు, నీళ్లు పోసి కాసేపు కాగబెట్టాలి. తర్వాత ఇందులో మెంతిపొడి, నీళ్లు కలిపిన శనగపిండి, ఉప్పు వేసి బాగా కలిపి పులుసును మరికాసేపు మరిగించాలి.

మామిడికాయ చారు 

కావాల్సినవి :

పచ్చిమామిడి కాయ – ఒకటి
ఉప్పు – సరిపడా, బెల్లం – కొంచెం
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
పచ్చిమిర్చి, ఎండు మిర్చి – ఒక్కోటి రెండు చొప్పున
ఉల్లిగడ్డ తరుగు – అరకప్పు

తయారీ :

కుక్కర్​లో నీళ్లు మరిగించాక మామిడికాయను ఉడికించాలి. ఉడికిన మామిడికాయను ఒక గిన్నెలో వేసి గుజ్జు తీసి, వడకట్టాలి. అందులో కొన్ని నీళ్లు పోసి, ఉప్పు, బెల్లం వేసి కలిపి కాగబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, ఎండు మిర్చి, పసుపు వేసి వేగించాలి. కాగుతున్న మామిడికాయ పులుసులో ఈ తాలింపు వేసి కలపాలి. 

కరివేపాకుతో..

కావాల్సినవి :

కరివేపాకు – రెండు కప్పులు
ధనియాలు, జీలకర్ర, పసుపు – ఒక్కో టీస్పూన్ చొప్పున
ఎండు మిర్చి – ఐదు
ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
చింతపండు పులుసు – ఒక కప్పు
కారం – ఒకటిన్నర టీస్పూన్
బెల్లం – కొంచెం
ఉప్పు, నూనె – సరిపడా

తయారీ :

పాన్​లో నూనె వేడి చేసి, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర వేయాలి. అవి వేగాక అదే నూనెలో కరివేపాకు వేసి వేగించాలి. వాటితోపాటు ఉల్లిగడ్డ తరుగును మిక్సీ జార్​లో వేసి గ్రైండ్ చేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి, వెల్లుల్లి రెబ్బలు వేగించాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేగించి మిక్సీ పట్టిన కరివేపాకు ముద్ద వేసి కలపాలి. అందులో పసుపు, ఉప్పు, చింతపండు పులుసు వేసి కలపాలి. పులుసు దగ్గర పడ్డాక బెల్లం వేయాలి.

 

మిరియాల పులుసు 

కావాల్సినవి :
మిరియాలు – రెండు టీస్పూన్లు, జీలకర్ర, ఆవాలు – ఒక్కో టీస్పూన్ చొప్పున, ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు, పెసరపప్పు – ఒక టీస్పూన్
మెంతులు – పావు టీస్పూన్, ఎండు మిర్చి – నాలుగు, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – కొంచెం, సాంబార్ ఉల్లిగడ్డలు – రెండు కప్పులు, టొమాటోలు – రెండు, చింతపండు పులుసు – ఒక కప్పు

తయారీ :

నూనె వేయకుండా మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకులను వేగించాలి. చల్లారాక వీటన్నింటినీ మిక్సీలో వేసి, వేడి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, సాంబార్ ఉల్లిగడ్డలు, వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ముక్కలు వేసి, చింతపండు పులుసు పోసి ఉడికించాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన మిరియాల మసాలా పేస్ట్ వేసి కలపాలి. మూత పెట్టి పావుగంట ఉడికించాలి. పులుసు దగ్గర పడితే ఘాటైన మిరియాల పులుసు రెడీ.

వంకాయ పల్లీలు

కావాల్సినవి :

టొమాటోలు – రెండు
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
నల్ల వంకాయలు – ఆరు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
ఆవాలు, జీలకర్ర – ఒక్కో టీస్పూన్ చొప్పున
కరివేపాకు – కొంచెం
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – సరిపడా
పల్లీలు – ఒకటిన్నర కప్పు
తెల్ల వంకాయలు – నాలుగు
ధనియాల పొడి – రెండు టీస్పూన్లు
కారం – రెండున్నర టీస్పూన్లు

పసుపు – ఒక టీస్పూన్
కొత్తిమీర – కొంచెం

తయారీ :

వేడినీళ్లలో పల్లీలను రెండు గంటలు నానబెట్టాలి. టొమాటోలు మిక్సీ పట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి, నల్ల వంకాయలు నాలుగు వైపులా చీరి వేగించి పక్కన పెట్టాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు వేసి వేగించాలి. నానబెట్టిన పల్లీలు వేగించాక, తెల్ల వంకాయల తరుగు, ధనియాల పొడి, కారం, పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. కొంచెం బెల్లం, నిమ్మరసం, వేగించిన నల్ల వంకాయలు, కొత్తిమీర వేసి కలపాలి. మూత పెట్టి పావుగంట ఉడికిస్తే వంకాయ పల్లీల పులుసు రెడీ.