చెన్నై: నార్వే చెస్ టోర్నమెంట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఘనంగా సత్కరించారు. సోమవారం చెన్నై సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం విజయ్.. ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో 20 ఏళ్ల ఈ యువ ఆటగాడితో ముఖ్యమంత్రి కాసేపు చెస్ ఆడారు.ఆటలో పూర్తిగా లీనమైన సీఎం విజయ్.. తన రాజును కాపాడుకోవడానికి వ్యూహాత్మక ఎత్తులు వేశారు.
ప్రజ్ఞానంద వేసిన చురుకైన చివరి ఎత్తుకు సీఎం రాజు చెక్‌మేట్‌కు గురయ్యాడు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ ఆటలో ప్రజ్ఞానంద విజయం సాధించగా, సీఎం చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ ఆ యువ ఆటగాడిని అభినందించారు. రాష్ట్ర క్రీడా మంత్రి ఆధవ్ అర్జున, ప్రజ్ఞానంద తల్లిదండ్రులు ఈ ఆసక్తికరమైన ఆటను దగ్గరుండి వీక్షించారు." ముఖ్యమంత్రి నాతో చెస్ ఆడతారని నేను అస్సలు ఊహించలేదు, ఆయన చాలా బాగా ఆడారు. సీఎం ఎంతో మద్దతుగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నారు " అని ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశారు.
