స్టాలిన్​ స్టయిలే వేరు

స్టాలిన్​ స్టయిలే వేరు
  • తమిళనాడులో నయా పాలన.. జనంతో కలిసిపోతున్న సీఎం
  • కరోనా, చెన్నై వరదల టైంలో ప్రజలకు అండ
  • పథకాలపై ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకునేందుకు తానే రంగంలోకి
  • స్కూళ్లు, పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు
  • గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ కొత్త ట్రెండ్​
  • మెచ్చుకుంటున్న ప్రతిపక్షాలు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నయా పాలన అందిస్తున్నారు. ఆఫీసులో కూర్చుని కాకుండా.. జనం మధ్యకెళ్లి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడికి నేరుగా వెళ్తున్నారు. చెన్నైని వర్షాలు ముంచెత్తుతుంటే కాన్వాయ్ హంగామా లేకుండా ఆ వరద నీటిలో, బురదలో వీధి వీధి తిరుగుతూ ప్రజలను పరామర్శిస్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆడబిడ్డకు అవమానం జరిగితే.. బాధితురాలి ఇంటికి వెళ్లి ‘నేనున్నా’ అని భరోసా ఇస్తున్నారు. ప్రజల్లోకి వచ్చి పథకాల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకుంటున్నారు. అవసరమైతే ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తున్నారు. ‘వ్యక్తి పూజ’కు దూరంగా ఉంటున్నారు. ఇలా పథకాలతో, ప్రవర్తనతో, మాటలతో, చేతలతో సామాన్యుల సీఎం అనిపించుకుంటున్నారు.

కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు స్టాలిన్. సొంత కుటుంబంలోనే ఉన్న వ్యతిరేకతను జయించారు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా.. సొంత ఇమేజ్‌‌‌‌ను సృష్టించుకున్నారు. జనంలో ఉంటూ.. జనం మాట వింటూ.. ఆరు నెలల్లోనే పాలనలో ఔరా అనిపించుకున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి.. దారిలో ఉన్న టీస్టాల్‌‌‌‌లో ఆగుతారు. అక్కడే టీ తాగుతూ.. స్థానికుల సమస్యలు తెలుసుకుంటారు. పోలీస్ స్టేషన్‌‌‌‌లోకి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఇంటింటికీ విద్య పథకాన్ని ప్రారంభించేందుకు వెళ్తూ.. దారిలో ప్రభుత్వ స్కూల్‌‌‌‌కు వెళ్తారు. క్లాసుల్లో స్టూడెంట్లు, టీచర్లతో మాట్లాడుతారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం కోసం చేస్తున్న వంట పనులను తానే స్వయంగా పరిశీలిస్తారు. కరోనా టైంలో ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తేయకుండా.. విడతల వారీగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు.
 
అందరినీ కలుపుకుపోతూ..

తమిళనాడులో అధికార, ప్రతిపక్షాలు బద్ధశత్రువుల్లా ఉంటాయి. డీఎంకే, అన్నాడీఎంకే ఢీ అంటే ఢీ అంటుంటాయి. దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు అలానే ఉన్నాయి. కానీ స్టాలిన్ రాకతో పరిస్థితి కాస్త మారింది. అందరినీ కలుపుకుపోతూ స్టాలిన్ పాలన సాగిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని కోరారు. అన్ని పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. కోయంబత్తూరులో జరిగిన సమావేశంలో మంత్రుల పక్కన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూర్చుని రివ్యూలో పాల్గొన్నారు. అన్నాడీఎంకే హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న విజయభాస్కర్‌‌‌‌‌‌‌‌ను.. కరోనా అడ్వైజరీ ప్యానెల్‌‌‌‌లో కొనసాగించారు. తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవు.

సేవకు సత్కారం..

కరోనా సెకండ్ వేవ్‌‌‌‌ టైంలో సేవ చేసిన హెల్త్ కేర్ సిబ్బందికి ఇన్సెంటివ్‌‌‌‌లు ప్రకటించారు. 2021 ఏప్రిల్‌‌‌‌ నుంచి జూన్‌‌‌‌ వరకు సేవలందించిన 24,908 మంది మెడికల్ ఆఫీసర్లు, 26,615 మంది నర్సులు, 6,791 మంది శానిటరీ ఇన్‌‌‌‌స్పెక్టర్లు, 8,658 మంది విలేజ్ నర్సులు, 6,083 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 32,113 మంది ఇతర హెల్త్‌‌‌‌ వర్కర్లు సహా మొత్తం 1,05,168 మందికి చెక్కులు అందజేశారు.

ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా..

రాజేశ్వరి అనే ఎస్‌‌‌‌ఐ స్వయంగా అతడిని తన భుజాలపై మోశారు. ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో.. విషయం స్టాలిన్ దృష్టికి వెళ్లింది. రాజేశ్వరిని తన ఆఫీసుకు పిలిపించి అభినందించారాయన. ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని పొగిడారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులను రెగ్యులరైజ్ చేశారు. దాదాపు 1,212 మంది నర్సుల ఉద్యోగాలను పర్మనెంట్‌‌‌‌ చేశారు. ఇలా వారికి నైతికంగా మద్దతుగా నిలిచారు. ఆత్మవిశ్వాసం నింపారు.


జాగింగ్, జిమ్.. మిస్టర్ ఫిట్

స్టాలిన్ ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతారు. జిమ్‌‌‌‌లో కసరత్తులు చేస్తారు. జాగింగ్‌‌‌‌కు వెళ్తారు. సీఎం కాక ముందు చెన్నై వీధుల్లో సైక్లింగ్ చేసేవారు. జిమ్‌‌‌‌లో స్టాలిన్ కసరత్తులు చేస్తున్న వీడియోలు కూడా గతంలో బయటికి వచ్చాయి. ఇటీవల మార్నింగ్ వాక్‌‌‌‌ చేస్తూ.. స్థానికులతో ఆయన ముచ్చటించడం ఇటీవల వైరల్ అయింది.

వరదల టైంలో ప్రజలకు అండగా..

భారీ వర్షాలకు చెన్నై నీరైంది. ఎటు చూసినా వరద. ట్విట్టర్‌‌‌‌లో అలర్ట్‌‌లు, సూచనలు చేస్తూ ఆఫీసులో కూర్చోలేదు స్టాలిన్. ఏరియల్ సర్వే అంటూ హెలికాప్టర్‌‌‌‌లో చక్కర్లు కొట్టి వెళ్లలేదు. నేరుగా రంగంలోకి దిగారు. రెయిన్ కోటు వేసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో, మోకాలి లోతు నీళ్లలో తిరిగారు. మంత్రులు, అధికారులను పరుగులు పెట్టించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేశారు. సహాయ కార్యక్రమాలను పరిశీలించారు. వర్ష బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో వంట పనులను పరిశీలించారు. వండిన ఆహారాన్ని రుచి చూశారు. కొద్దిసేపు బాధితులకు పంపిణీ చేశారు. 

అందరికీ అర్చకత్వం

బ్రాహ్మణులకే పరిమితమైన అర్చక వృత్తి విషయంలో స్టాలిన్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. బలహీనవర్గాలకి చెందిన 58 మందికి అర్చకులుగా అవకాశం కల్పిస్తూ నియామక పత్రాలను అందించారు. కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరూ అర్చకత్వం చేపట్టవచ్చని చెప్పారు. మహిళా అర్చకులకు శిక్షణ తరగతులను కూడా ప్రారంభించారు. దేవాలయాల్లో అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని పెరియర్‌‌ నుంచి కరుణానిధి  దాకా చాలా మంది పోరాటం చేశారు. అవన్నీ ఇప్పుడు ఫలించాయి.

తమిళనాడులోని మామల్లపురం.. ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. నరికురవర్‌‌ తెగకు చెందిన అశ్విని అనే మహిళ బువ్వ తినేందుకు వెళ్లింది. కానీ ‘మీకు బంతిలో పెట్టం. గుడి బయట నిలబడండి. కార్యక్రమం అయినంక పెడుతం’ అన్నారు నిర్వాహకులు. ఆ రోజు తమకు జరిగిన అవమానంపై ఆవేదనతో అశ్విని మాట్లాడిన మాటలు.. ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి వెళ్లాయి. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఎక్కడైతే ‘అన్నం పెట్టం’ అని అన్నారో.. అక్కడే ముఖ్యమంత్రి పక్కన కూర్చుని సంతో షంగా బంతి భోజనం చేసింది ఆమె. అశ్వినిని  ప్రభుత్వం చీర సారెతో సత్కరించింది. ఆమె పిలిచిందని ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిగొచ్చారు. అశ్విని ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడారు. అంతే కాదు నరికురవర్, ఇరుల తెగకు చెందిన 282 మందికి 4.53 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను వర్తింపజేశారు. స్టాలిన్ వచ్చి.. తమ బాధలన్నీ తీర్చడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. 

వ్యక్తి పూజకు దూరం
తమిళనాడులో వ్యక్తి పూజ ఎక్కువ. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలే కాళ్లు మొక్కేటోళ్లు. ముఖ్యమంత్రిని మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు పొగడటం అసెంబ్లీలో తరచూ కనిపిస్తుంటుంది. కొందరు పొగడ్తలు కురిపించేందుకే మైక్ అందుకుంటుంటారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో కూడా డీఎంకే ఎమ్మెల్యేలు కీర్తనలు అందుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్, దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధిలను పొగుడుతూ సుదీర్ఘ ప్రసంగం కొనసాగించారు. ఈ పరిస్థితిపై స్టాలిన్ అభ్యంతరం తెలిపారు. తనపై ప్రశంసలు, పొగడ్తల ప్రసంగాలు వద్దని ఇంతకుముందే చెప్పానని.. అయినా సరే సభ్యులు తమ వైఖరి మానుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు మానేసి, బడ్జెట్, సమస్యలపై చర్చించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సభా సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత ప్రభుత్వ పథకాలూ కొనసాగిస్తుండు

గత ప్రభుత్వ హయాంలో పిల్లలకు పంపిణీ చేసేందుకు 65 లక్షల బ్యాగులను సిద్ధం చేశారు. ఇంతలో సర్కారు మారిపోయింది. వాటిపై మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండటంతో స్టూడెంట్లకు ఇవ్వాలా, వద్దా అనే సమస్య వచ్చింది. కానీ వాటిని పంపిణీ చేయాలని స్టాలిన్ ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో రూ.13కోట్లు సేవ్ అయ్యాయని అసెంబ్లీలో మంత్రి అన్‌‌‌‌బిల్ మహేశ్ పొయ్యమొజీ చెప్పారు. సేవ్ అయిన డబ్బును స్టూడెంట్లకు సంబంధించిన ఇతర పథకాలకు వాడుకోవచ్చన్నారు. స్టాలిన్ తన నిర్ణయంతో ప్రతిపక్షాలు సహా అన్ని వర్గాల ప్రశంసలు పొందారు. 

చెన్నై కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో 2013లో 207 అమ్మ క్యాంటీన్లను అప్పటి సీఎం జయలలిత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెన్నైలో 400కు పైగా క్యాంటీన్లు, రాష్ట్రవ్యాప్తంగా 700కుపైగా పని చేస్తున్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ సమయంలో కొన్ని క్యాంటీన్లలో ఫ్రీగా ఆహారం అందించారు. తాము అధికారంలోకి వస్తే కలైంజర్‌‌‌‌ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని డీఎంకే ప్రకటించింది. స్టాలిన్ సీఎం బాధ్యతలు చేపట్టగానే.. చెన్నై ముగప్పెయిర్‌‌‌‌లో అమ్మ క్యాంటీన్‌‌‌‌పై ఇద్దరు డీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ఆహార పదార్థాలతోపాటు కూరగాయలను ధ్వంసం చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్‌‌‌‌ ప్రకటించారు. తొలగించిన బోర్డులను మళ్లీ అక్కడే ఏర్పాటు చేయించారు. అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్నారు.

2006లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత.. ఓ హెలికాప్టర్ కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు 14 మంది వెళ్లేందుకు అవసరమైన వసతులన్నీ ఇందులో ఉన్నాయి. తాను సీఎంగా ఉన్నంత కాలం జయ ఆ చాపర్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకున్నారు. జయలలిత చనిపోయాక హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ను పెద్దగా వాడుకోలేదు. 2019 దాకా మీనంబాక్కం విమానాశ్రయానికే చాపర్ పరిమితమైంది. స్టాలిన్ సీఎం అయ్యాక.. ఎక్కడికి వెళ్లినా రైలు, విమానం , రోడ్డు ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ను ఎయిర్ అంబులెన్స్‌‌‌‌గా మార్చాలని స్టాలిన్ నిర్ణయించారు.