తమిళనాడు మాజీ డీజీపీ అరెస్ట్.. విడిచిపెట్టిన మేజిస్ట్రేట్

తమిళనాడు మాజీ డీజీపీ అరెస్ట్..  విడిచిపెట్టిన మేజిస్ట్రేట్

చెన్నై:  అక్రమంగా ప్రవేశించి, సెక్యూరిటీపై దాడి చేసిన ఆరోపణలపై మాజీ డిజిపి రాజేష్ దాస్‌ను మే 24వ తేదీ శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను చెన్నై శివార్లలోని తిరుప్పోరూర్‌లోని జిల్లా మున్సిఫ్-కమ్- జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. రాజేష్ దాస్ కు రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది. కోర్టులో తాను ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అవసరమైన ష్యూరిటీలను అమర్పించాలని.. అలాగే,  అవసరమైనప్పుడు పోలీసుల విచారణకు అందుబాటులో ఉండాలని మాజీ డీజీపీ రాజేష్ దాను మేజిస్ట్రేట్ విడుదల చేశారు.

తయ్యూర్ లో గల తన ఇంట్లోకి చొరబడి సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడని ఆరోపిస్తూ రాజేష్ దాస్ మాజీ భార్య TN ఇంధన కార్యదర్శి బీలా వెంకటేశన్ ఫిర్యాదు మేరకు పల్లికరణై డిప్యూటీ కమిషనర్ గౌతమ్ గోయల్ నేతృత్వంలోని కేలంబాక్కం పోలీసులు రాజేష్ దాస్‌ను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు స్థానికంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మే 18వ తేదీ సోమవారం తయ్యూర్‌లోని తన ఇంట్లోకి రాజేష్ దాస్, మరో 10 మంది అక్రమంగా చొరబడి తన సెక్యూరిటీ గార్డు గోపిపై దాడి చేశారని బీలా వెంకటేశన్ కేళంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు.