
కరోనా లాక్ డౌన్ లో లిక్కర్ దొక్కపోవడంతో మద్యం ప్రియులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇంట్లోనే ఆల్కహాల్ తయారు చేసుకోవడం ఎలా అనేదాని కోసం నెట్ లో కోట్లాది మంది సెర్చ్ చేస్తున్నారని ఇటీవలే గూగుల్ ట్రెండ్స్ లో వెల్లడైంది. దీన్ని ఇంటర్నెట్ లో వెతకడం దగ్గర నుంచి నేరుగా రియాలిటీలోకి తెచ్చి.. సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో ముగ్గురు కటకటాల పాలయ్యారు. అందులో ఓ యువకుడు, అతడి ఫ్రెండ్ తోపాటు తండ్రి కూడా ఉండడంతో పోలీసులు కూడా షాకయ్యారు.
లాక్ డౌన్ కారణంగా తమిళనాడులో మార్చి 24 నుంచి లిక్కర్ షాపులు మూతపడ్డాయి. దీంతో చెన్నైకి చెందిన 26 ఏళ్ల యువకుడు, అతడి తండ్రి (56) ఇంట్లోనే ఆల్కహాల్ తయారు చేయాలనుకున్నారు. రహస్యంగా గ్రేప్ వైన్, గంజితో తయారు చేసే లోకల్ లిక్కర్.. సుండ గంజి కాచారు. దీని గురించి పోలీసులు పక్కా సమాచారం అందడంతో వారి ఇంటిలో సోదాలు చేశారు. 30 లీటర్ల గ్రేప్ వైన్, ఐదు లీటర్ల సండ గంజి సీజ్ చేశారు. అక్రమ మద్యం తయారీ కేసులో ఆ తండ్రీకొడులతో పాటు వారికి సహకరించిన మరో యువకుడిని కూడా అరెస్టు చేశారు పోలీసులు.
లాక్ డౌన్ ను మే 3 తర్వాత మరో రెండు వారాలు పొడిగించిన కేంద్రం… గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనేక సడలింపులు ప్రకటించింది. ఇందులో భాగంగా లిక్కర్ షాపులు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం అనేక రాష్ట్రాల్లో లిక్కర్ షాపుల దగ్గర వందలాది మంది క్యూలు కట్టారు. అయితే తమిళనాడులో కేసులు ఎక్కువగా ఉండడంతో మే 7 వరకు లిక్కర్ షాపులు తెరవకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది.