శివకాశిలోని భద్రకాళి ఆలయంలో అగ్నిప్రమాదం

శివకాశిలోని భద్రకాళి ఆలయంలో అగ్నిప్రమాదం

తమిళనాడులోని విరుదునగర్‌లోని ప్రముఖ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన అనంతరం రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆలయ గోపురం పైభాగం దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

శివకాశి భద్రకాళి అమ్మ ఆలయంలో కుంభాభిషేకం పనులు జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ నిర్మాణ పనుల కారణంగా చెక్క స్తంభాలు ఏర్పాటు చేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పైభాగం గోనె సంచులతో కప్పబడి ఉండగా, అది కూడా పూర్తిగా బూడిదగా మారింది. ఘటనాస్థలికి చేరుకున్న శివకాశి అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేకపోవడం అందరికీ ఉపశమనాన్ని కలిగించింది.

నిర్మాణ పనుల కారణంగా ఆలయ గోపురం పైభాగంలో కలప, వెదురు వంటి తదితర వస్తువులను ఎక్కువగా ఉంచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ సమయంలోనే కళ్యాణ ఊరేగింపు జరుగుతుండగా..  ఎవరో బాణాసంచా కాల్చినట్టు సమాచారం. ఆ బాణాసంచా నిప్పురవ్వ గుడి పైభాగానికి చేరుకోవడం వల్లనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అనంతరం పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు బాధ్యులైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.