ఉద్యోగానికి డబ్బులు : ఈడీ అరెస్ట్ చేయగానే.. మంత్రికి గుండెపోటు..

ఉద్యోగానికి డబ్బులు : ఈడీ అరెస్ట్ చేయగానే.. మంత్రికి గుండెపోటు..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం. రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో.. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్.. ఈడీ అధికారులు.. ఆయన్ను చెన్నైలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈడీ అధికారుల అరెస్ట్ తో మంత్రి సెంథిల్ బాలాజీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. కుప్పకూలిపోయారు. గుండెనొప్పితో కింద పడి గిలగిలా కొట్టుకున్నారు.  మంత్రి ఆరోగ్య పరిస్థితి చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. కొన్ని రోజులుగా సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. 

కేసు వివరాలు ఏంటీ :

2013 సంవత్సరంలో.. సెంథిల్ బాలాజీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేశారని.. ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన డీఎంకే పార్టీలో చేరారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో.. విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2013 నాటి కేసులో ఈడీ విచారణ చేస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ అధికారుల బృందాలు.. మంత్రి బాలాజీ ఇల్లు, ఆఫీసుతోపాటు, ఆయన సోదరుడి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి క్వార్టర్స్ లోనే ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

కక్ష సాధింపులు చర్యలు : సీఎం స్టాలిన్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. మంత్రులను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారాయన. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన మంత్రి సెంథిల్ బాలాజీని పరామర్శించటానికి ఆస్పత్రికి తరలివస్తున్నారు తమిళనాడు ఇతర శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈడీ వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. 

ప్రస్తుతం మంత్రి బాలాజీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం తప్పిందని ప్రకటించారు డాక్టర్లు. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు డాక్టర్లు.