బీజేపీ ఓ విషసర్పం.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి

బీజేపీ ఓ  విషసర్పం.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి
  • బీజేపీ ఓ  విషసర్పం
  • మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి
  • తమిళనాడు లాంటి ఇంట్లో పాము దూరకుండా చూసుకోవాలి
  • చెత్తను ఎత్తి పారేసినప్పుడే ఇది సాధ్యమని కామెంట్

చెన్నై : సనాతన ధర్మంపై వివాదాస్పద కామెంట్లు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. తాజాగా బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ విష సర్పంలాంటిదని అన్నారు. ఆ విష సర్పానికి షెల్టర్ ఇచ్చే చెత్తలా ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ తయారైందని మండిపడ్డారు. పాము ఇంట్లోకి దూరితే.. దాన్ని బయటికి వెళ్లగొడితే సరిపోదని, అది మళ్లీ ఇంటి పరిసరాల్లోనే దాక్కుని ఉంటుందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. 

టైమ్ చూసి మళ్లీ ఆ పాము ఇంట్లోకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ చెత్తను తొలగించినప్పుడే పాము అక్కడి నుంచి వెళ్లిపోతుందని చెప్పారు. తమిళనాడు లాంటి తమ ఇంట్లో చెత్తలాంటి అన్నాడీఎంకే పార్టీని నిర్మూలించినప్పుడే.. విష సర్పం లాంటి బీజేపీ వెళ్లిపోతుందన్నారు. నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్ ఇంట్లో జరిగిన పెండ్లికి హాజరైన ఉదయనిధి.. ఈ కామెంట్లు చేశారు. 

గతంలో మోదీని పాముతో పోల్చిన రాజా

లోక్‌‌సభ ఎంపీ, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ.రాజా కొన్ని రోజుల కింద ప్రధాని మోదీని పాముతో పోల్చారు. అందరూ విష సర్పం లాంటి మోదీ కాటేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారని, అందుకు సరైన విరుగుడు ద్రవిడమే అని రాజా కామెంట్లు చేశారు. ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని విమర్శించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు.