కారంతో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే

కారంతో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే

పాలాభిషేకం,  జలాభిషేకం గురించి తెలుసు. తమ నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం గురించి  విన్నాం. కొందరు అందం కోసం చందనం, గులాబీ రేకులతో స్నానం చేస్తారని తెలుసు. కానీ కానీ మీరు ఎప్పుడైనా కారంతో స్నానం చేయడం చూశారా. లేదా మీరే ఎప్పుడైనా కారంతో స్నానం చేశారా..? ఏంటీ కారంతో స్నానమా..అనుకుంటున్నారా..అవును..ఓ ప్రాంతంలో కారంతో స్నానం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కారంతో స్నానం ఎక్కడంటే

తమిళనాడు రాష్ట్రంలోని  ధర్మపురి జిల్లా నడపనహళ్లీ గ్రామానికి చెందిన గోవిందం అనే పూజారి కారం నీళ్లతో స్నానం చేయడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతీ ఏడాది ఆది అమావాస్య రోజున నడపనహళ్లీ గ్రామ దైవం పెరియ కరుప్పసామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడి భక్తులంతా  పూజారికి కారం నీళ్లతో స్నానం చేయిస్తారు. 

108 కేజీల కారంతో..స్నానం ఎందుకు చేస్తారంటే..

గ్రామదేవత కరుణ కోసం 108 కేజీల కారం నీటితో పూజారి గోవిందందకు భక్తులు స్నానం చేయిస్తారు. అయితే ఇలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటాడు .  ఆ తర్వాత కారం స్నానం చేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

మంట పుట్టదా మరి..

పూజారి గోవిందం కారం నీటితో స్నానం చేస్తుంటే ఆ ఘాటుకి భక్తులు అక్కడ నిలబడలేక పక్కకు వెళ్లిపోయారు. కానీ పూజారి గోవిందం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కారం నీటితో హాయిగా స్నానం చేశాడు.  కారం నీటితో స్నానం చేసిన తర్వాత  భక్తులు మళ్లీ ఆయనపై సాధారణ నీళ్లు పోశారు. కారం ఘాటు పోయేంత వరకు స్నానం చేయించారు. నడపనహళ్లీ గ్రామంలో  ఈ సంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుందట. ట్విస్ట్ ఏంటంటే..కారం నీటితో స్నానం చేసే సమయంలో పూజారికి ఎలాంటి మంట పుట్టదట.

సిగరెట్లు, మద్యమే నైవేద్యం..

 నడపనహళ్లీ గ్రామ దైవం పెరియ కరుప్పసామి  ఆలయంలో మరో విశేషం ఏమిటంటే....భక్తులు  పెరియ కురుప్పస్వామికి  మద్యం, సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.