
- రాష్ట్రంలో 20 జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఇయ్యాల చెన్నైలో భారీ వర్షం పడే చాన్స్
చెన్నై: తమిళనాడులోని చెన్నై సహా 20 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్అలర్ట్ప్రకటించింది. ఇప్పటికే కుండపోత వానలు కురుస్తున్న చెన్నైలో గురువారం భారీ వర్షం కురవొచ్చని వెల్లడించింది. వర్షం పడే టైమ్లో జనాలు బయటకు వెళ్లొద్దని.. తిండి, నీళ్లు రెడీగా పెట్టుకోవాలని గ్రేటర్ చెన్నై కమిషనర్గగన్ దీప్సింగ్బేడి కోరారు. కమ్యూనికేషన్కోసం ఎలక్ట్రానిక్పరికరాలను ముందు జాగ్రత్తగా బాగా చార్జ్చేసుకోవాలన్నారు. చెన్నైలో 53 బోట్లు, 507 మోటార్పంపులు, 60 హెవీ డ్యూటీ పంపులు సిద్ధం చేశామని చెప్పారు. చెంబరమ్బక్కమ్సహా సిటీకి దగ్గర్లోని అన్ని రిజర్వాయర్ల నుంచి నీటిని మెల్లమెల్లగా రిలీజ్చేస్తామన్నారు. ప్రస్తుతం 169 రిలీఫ్సెంటర్లు పని చేస్తున్నాయని, నీట మునిగిన 400 ప్రాంతాల్లో 216 ప్రాంతాలను క్లియర్చేశామని వివరించారు. అమ్మ క్యాంటీన్లలో ఆహారాన్ని ఫ్రీగా ఇస్తామని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహారం సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం 434 సైరన్ టవర్లను ఏర్పాటు చేసింది.
12కు పెరిగిన మృతులు
కొద్ది రోజులుగా తమిళనాడులో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇప్పటివరకు 46% ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు చెప్పారు. భారీ వానలు, వరదలకు ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. 530 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. 1,700 కన్నా ఎక్కువ మంది రిలీఫ్క్యాంపుల్లో ఉన్నారు. చెన్నైలో 2015 తర్వాత ఇంత స్థాయిలో వానలు కురవడం ఇదే తొలిసారి.