లైంగిక వేధింపులతో 12వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్య

లైంగిక వేధింపులతో 12వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్య

తమిళనాడులోని కరూర్‌‌ జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ ఆమె చదివే బడిలోని మ్యాథ్స్‌ టీచర్ మృతికి దారి తీసింది.  12వ తరగతి చదువుతున్న ఆ స్టూడెంట్ ఉరేసుకుని బవన్మరణానికి పాల్పడిన వారం రోజులకే టీచర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బాలిక మరణానికి ఆ మ్యాథ్స్ టీచరే కారణమంటూ స్కూల్‌లోని కొంత మంది నిందలు వేయడంతో తట్టుకోలేక ఆయన నిన్న అర్ధ రాత్రి ప్రాణాలు తీసుకున్నాడు.

ఇతరులకు సాయం చేస్తూ బతకాలనకున్నా: బాలిక సూసైడ్ నోట్

కరూర్‌‌ జిల్లాలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని గత వారం సూసైడ్ చేసుకుంది. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడే ముందు సూసైడ్ నోట్ రాసింది. ‘‘కరూర్ జిల్లాలో లైంగిక వేధింపుల కారణంగా చనిపోయే చివరి అమ్మాయిని నేనే కావాలి. ఇకపై మరో అమ్మాయి ప్రాణాలు పోకూడదు. నా మృతికి కారణమెవరో చెప్పడానికి నేను ధైర్యం చేయలేకపోతున్నాను. కష్టంలో ఉన్న వాళ్లకు సాయం చేయడానికి చిరకాలం బతకాలన్నది నా ఆశ.. కానీ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపోవాల్సి వస్తోంది’’ అని ఆ బాలిక సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 

నాకు సంబంధం లేకున్నా నిందలు: మ్యాథ్స్ టీచర్ సూసైడ్ నోట్

ఆ బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె బంధువులు, కుటుంబసభ్యులతో పాటు స్కూల్ టీచర్లు, ఇతర స్టాఫ్‌ను కూడా విచారించారు. పోలీసులు ప్రశ్నించిన వారిలో స్కూల్ మ్యాథ్స్ టీచర్ శరవణన్‌ (42)  కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆయన పాత్ర ఏమీ లేదని పోలీసులు తేల్చారు. కానీ నాటి నుంచి స్కూల్‌లో కొంత మంది స్టూడెంట్స్, టీచర్లు ఆ బాలిక మరణానికి కారణం నువ్వే అంటూ శరవణన్‌ను నిందించడం మొదలుపెట్టారు. దీంతో వారి మాటలకు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై నిన్న అర్ధ రాత్రి తిరుచ్చిలోని తన మామ ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. ‘‘స్కూల్‌లో పిల్లలతో పాటు ఊరిలో కొంత మంది నన్ను హేళన చేశారు. ఆ బాలిక తన సూసైడ్ నోట్‌లో నా పేరు రాయకున్నా నిందలు వేశారు. ఆ బాలిక ఆత్మహత్యకు నా ప్రమేయం ఏమీ లేకున్నా నన్ను దోషిలా నిలబెట్టేందుకు ప్రయత్నం జరిగింది. సమాజంలో ఈ నిందతో బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నా” అంటూ చనిపోయే ముందు శరవణన్ సూసైడ్ నోట్ రాశారు.