భర్తతో వీడియో కాల్లో లొల్లి.. నట్టింట్లో ఉరేసుకుని ప్రాణం తీసుకున్న సీరియల్ నటి !

భర్తతో వీడియో కాల్లో లొల్లి.. నట్టింట్లో ఉరేసుకుని ప్రాణం తీసుకున్న సీరియల్ నటి !

చెన్నై: తమిళ బుల్లి తెర నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తమిళ టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ఏప్రిల్ 6,2026న చెన్నైలోని ఆమె నివాసంలో సుభాషిణి విగత జీవిగా కనిపించింది. ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఆమె పుట్టిన రోజు ఉండగా ఇంతలో సుభాషిణి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

‘కయల్’ అనే తమిళ సీరియల్తో సుభాషిణికి మంచి గుర్తింపు దక్కింది. సుభాషిణి స్వస్థలం శ్రీలంక. 2012లో అవన్ సినిమాతో వెండి తెరపై కూడా సుభాషిణి తళుక్కున మెరిసింది. అయితే.. ఆశించిన రీతిలో తమిళ సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో బుల్లి తెరపై వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది.

షార్ట్ ఫిల్మ్స్, సామాజిక అవగాహన కోసం చిత్రీకరించిన కొన్ని వీడియోల్లో సుభాషిణి నటించింది. చెన్నైలోని అయ్యప్పంతంగల్లో సుభాషిణి నివాసం ఉంటోంది. భార్యాభర్తల మధ్య గొడవలే సుభాషిణి ఆత్మహత్యకు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీడియో కాల్లో భర్తతో గొడవ పడిన సుభాషిణి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. 

ఏప్రిల్ 12న సుభాషిణి పుట్టినరోజు. ఏప్రిల్ 21న ఆమె రెండో వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. ఇంతలో సుభాషిణి ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఇన్స్టాగ్రాంలో కూడా యాక్టివ్గా ఉండేది. 4 లక్షల మంది దాకా ఆమెను ఇన్స్టాగ్రాంలో ఫాలో అవుతున్నారు.