మన సర్కార్ దవాఖాన్లలో తమిళనాడు విధానం

మన సర్కార్ దవాఖాన్లలో తమిళనాడు విధానం
  • ఆసుపత్రులపై స్టడీ చేసొచ్చిన ఆఫీసర్లు
  • పేషెంట్స్ డబ్బులతోనే హాస్పిటల్స్ మెయింటెనెన్స్
  • సీటీ స్కాన్‌‌కు రూ.500, ఎంఆర్‌‌‌‌ఐకి రూ. 2వేలు
  • ఇక్కడ కూడా అమలు చేయాలని యోచన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్ల అభివృద్ధికి తమిళనాడు తరహా వ్యవస్థను అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆఫీసర్ల బృందం ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లొచ్చింది. అక్కడి ఆసుపత్రుల్లో  మెడిసిన్‌‌ కొనుగోలు, ఎక్విప్‌‌మెంట్‌‌ మెయింటెనెన్స్, శానిటేషన్ విషయంలో ఆ రాష్ట్రం అవలంబిస్తున్న పద్ధతులపై బృందం స్టడీ చేసింది. కొన్ని అంశాల్లో తెలంగాణ కంటే తమిళనాడు సిస్టమ్‌‌ చాలా అడ్వాన్స్​గా ఉందని బృందంలోని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మేరకు తమిళనాడు టూర్‌‌‌‌ స్టడీపై ఓ రిపోర్ట్‌‌ కూడా తయారు చేశారు. దీనిపై చర్చించేందుకు సోమవారం సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడులో ప్రభుత్వ దవాఖాన్లలో సీటీ స్కాన్లు, ఎంఆర్‌‌‌‌ఐ వంటి పెద్ద ఎక్విప్‌‌మెంట్ల మెయింటనెన్స్ బాగుందని, స్కాన్లు చేసేందుకు పేషెంట్ల వద్ద చార్జెస్ తీసుకుంటున్నారని రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. ఆ డబ్బులను మెయింటనెన్స్‌‌కు, రీఏజెంట్స్‌‌, కొత్త మిషన్ల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. తమిళనాడులోని 88 దవాఖాన్లలో సీటీ స్కాన్లు ఉన్నాయి. ఒక్కో స్కాన్‌‌కు  రూ.500 చొప్పున పేషెంట్ వద్ద చార్జ్ చేస్తున్నారు. దీంతో నెలకు సుమారు రూ.కోట్ల  ఆదాయం సమకూరుతోంది. ఎంఆర్‌‌‌‌ఐ స్కాన్‌‌కు రూ.2 వేలు వసూలు చేస్తున్నట్టు కమిటీ రిపోర్ట్‌‌లో పేర్కొంది. డబ్బులను మెడికల్ కార్పొరేషన్‌‌ అకౌంట్‌‌లో జమ చేస్తున్నారు. ఒకవేళ మిషన్ పాడైతే, ఈ అకౌంట్ నుంచి డబ్బులు తీసి వెంటనే రిపేర్ చేపిస్తున్నారు. మన దగ్గర కూడా తమిళనాడు తరహాలోనే నామినల్ చార్జెస్‌‌ వసూలు చేయాలని కమిటీ సజెస్ట్ చేస్తోంది. ఇప్పటికే నిమ్స్‌‌, ఎంఎన్‌‌జే క్యాన్సర్ హాస్పిటల్‌‌లో స్కానింగ్‌‌లకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటుకంటే ఇక్కడ చార్జీలు తక్కువగా ఉండడంతో, పేషెంట్ల నుంచి కూడా వ్యతిరేకత లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 38 జిల్లాలున్న తమిళనాడులో 88 సీటీ స్కాన్ మిషన్లు ఉంటే, 33 జిల్లాలు ఉన్న తెలంగాణలో కేవలం 20 మాత్రమే ఉండడం గమనార్హం.

అక్కడ తక్కువ ధరకు మెడిసిన్ ఎలాగంటే..!
తమిళనాడులో మెడిసిన్ కొనుగోలు చేసిన నెలలోపే సంబంధిత కాంట్రాక్టర్‌‌‌‌కు డబ్బులు చెల్లిస్తుండడంతో, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు నేరుగా టెండర్లు దాఖలు చేస్తున్నాయి. దీంతో అక్కడ మెడిసిన్ తక్కువ ధరకు దొరుకుతోంది. మన దగ్గర పేమెంట్ చాలా ఆలస్యంగా చేస్తుండడంతో ఫార్మా కంపెనీలు నేరుగా టెండర్లలో పాల్గొనడం లేదు. డీలర్లు, ఏజెంట్లు ఎక్కువ ధరకు కోట్ చేసి టెండర్లు దక్కించుకుంటున్నారు. ఈ విషయంలో మనం మారాల్సిన అవసరం ఉన్నదని కమిటీ తన రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఎమర్జెన్సీ మెడిసిన్ లిస్ట్‌‌, అడిషనల్ ఎమర్జెన్సీ మెడిసిన్ లిస్ట్ అని రెండు రకాలుగా విభజించి అక్కడ మందులు కొంటున్నారు. ఎమర్జెన్సీ లిస్ట్‌‌లోని అన్ని మందులను, 3 నెలలకు సరిపడా ప్రతి దవాఖానలో అందుబాటులో ఉంచుతున్నారు. అడిషనల్‌‌ లిస్ట్‌‌లో ఉన్న మెడిసిన్‌‌ను మాత్రం ఆయా హాస్పిటళ్లు, డాక్టర్ల నుంచి ఇండెంట్‌‌ తీసుకుని, వారు అడిగిన మందులు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఇవిగాకుండా ఇంకేదైనా మందు అవసరమైతే ఫండ్ నుంచి కొనుగోలు చేసి పేషెంట్లకు ఇచ్చేందుకు హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు అధికారాలు ఇచ్చారు. మన దగ్గర కూడా ప్రతి డాక్టర్ నుంచి ఇండెంట్‌‌ కోరాలని భావిస్తున్నారు. అలాగే, అక్కడ ప్రభుత్వ దవాఖాన్లలో చుట్టు పక్కల ప్రైవేటు మెడికల్ షాపులు లేవని, ఇందుకోసం అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవో తీసుకొచ్చిందని, మన దగ్గర కూడా అలాంటి జీవో తేవాల్సిన అవసరం ఉందని రిపోర్ట్‌‌లో వెల్లడించారు.