బాగా తీరింది వెధవకు : రూ.10 బెట్టింగ్.. రూ.3 వేల 500 ఫైన్

బాగా తీరింది  వెధవకు : రూ.10 బెట్టింగ్.. రూ.3 వేల 500 ఫైన్

ఈ సంఘటన చూస్తే.. ఏంట్రా బాబూ మీరు మరీ ఇలా ఉన్నారు అనక మానరు.. జస్ట్.. కేవలం 10 రూపాయలు అంటే 10 రూపాయల కోసం బెట్ వేసి.. పోలీసులతో 3 వేల 500 రూపాయల జరిమానా వేయించుకున్నాడు ఈ కుర్రోడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.. 

తమిళనాడు రాష్ట్రం ఈరోడ్  ప్రాంతానికి చెందిన ఫరూఖ్.. తన స్నేహితులతో బెట్ కట్టాడు. 10 రూపాయలు ఇస్తే.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ పై స్నానం చేస్తానని ఛాలెంజ్ చేశాడు. అనుకున్నట్లుగానే 10 రూపాయల కోసం.. ఈరోడ్ సిటీలోని పన్నీర్ సెల్వం పార్క్ జంక్షన్ లో.. తన యాక్టివా స్కూటర్ పై తెచ్చుకున్న బకెట్ నీళ్లతో స్నానం చేశాడు ఫారూఖ్. ఈ వీడియోను స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వైవిధ్యమైన వీడియోలు అలాగే ఉంటాయా ఏంటీ.. వైరల్ అయ్యింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. 

బిజీ రోడ్డులో.. నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బైక్ పై స్నానం చేయటం ఏంటంటూ పోలీసులు ఫైర్ అయ్యారు. ఫరూఖ్ ను వదిలేస్తే.. మరికొంత మంది పుట్టుకొస్తారని భావించిన ఈరోడ్ ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు.. హెల్మెట్ లేనందుకు.. మొత్తంగా 3 వేల 500 రూపాయలు జరిమానా విధించారు. ఫైన్ కట్టకపోతే బండి సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. దీంతో 10 రూపాయల బెట్ ఏమోకానీ.. ఇప్పుడు 3 వేల 500 రూపాయల చమురు వదిలిందని లోబోదిబో అంటున్నారు. కాకపోతే ఓ విషయంలో హ్యాపీగా ఫీలవుతున్నాడు ఫరూఖ్.. 10 రూపాయలతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు కదా.. 

ఈ వీడియో చూసి.. ఎవరైనా ఇలాంటి తరహా పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని.. బైక్స్ సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. రోడ్లపై వైరల్ వీడియోలు తీసినా.. చిల్లర పనులు చేసినా.. జరిమానాలు భారీగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.. ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.. వాడికి బాగా అయ్యింది.. బాగా తీరింది అని కొందరు అంటుంటే.. యూత్ టాలెంట్ తొక్కేస్తున్నారంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.