బీజేపీ ఒక్క ఎంపీ సీటు గెలవకుండా పనిచేస్తం : తమ్మినేని వీరభద్రం

బీజేపీ ఒక్క ఎంపీ సీటు గెలవకుండా పనిచేస్తం :  తమ్మినేని వీరభద్రం

హైదారబాద్, వెలుగు: తెలంగాణలో  బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకుండా పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకోసం బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడుతామని, సందర్భం అనుకూలిస్తే కాంగ్రెస్​తో కలిసి ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదరకపోవడంపై కాంగ్రెస్​కు, తమకూ ఒక క్లారిటీ ఉందన్నారు. శనివారం సెక్రటేరియెట్​లో  సీఎం రేవంత్​ రెడ్డిని తమ్మినేని వీరభద్రంతోపాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. 

అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంను కోరామన్నారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి సహాయం చేయాలని సూచించారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల కోసం జీవో సవరణ చేయాలన్నారు. పేదలకు జాగతోపాటు రూ.5లక్షల సహాయం చేయాలని కోరారు. షెడ్యూల్ ఎంప్లాయీమెంట్‌‌‌‌కు  8 ఏళ్లుగా వేతన సవరణ చేయలేదని సీఎంకు వివరించారు.  

ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం, ఉపాధ్యాయ బదిలీలు, ధరణి పోర్టల్ సవరణలు చేయాలని  విజ్ఞప్తి చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. హెల్త్‌‌‌‌ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. రైతు కూలీకి ప్రభుత్వం రోజుకు కనీసం రూ.600 ఇవ్వాలని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.