2040 కల్లా చంద్రుడిపై కాలుమోపాలి .. ఇస్రోకు ప్రధాని మోదీ లక్ష్యాలు

2040 కల్లా చంద్రుడిపై కాలుమోపాలి ..  ఇస్రోకు ప్రధాని మోదీ లక్ష్యాలు

న్యూఢిల్లీ: చంద్రయాన్–3, ఆదిత్య ఎల్–1 ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ప్రధాని మోదీ కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, 2040 నాటికి మనం చంద్రుడి మీద అడుగు పెట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన టార్గెట్ పెట్టారు. ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ మిషన్ పై ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గగన్ యాన్ మిషన్ ఏర్పాట్లపై మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. ఈ నెల 21న చేపట్టనున్న క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్టుపై ప్రజంటేషన్ ఇచ్చారు. 2025లో గగన్ యాన్ ప్రయోగం చేపట్టాలని మీటింగ్ లో నిర్ణయించారు. 

మీటింగ్ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటన విడుదల చేసింది. 2025లో భారతదేశ మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రయోగం చేపట్టనున్నట్టు అందులో పేర్కొంది. ‘‘చంద్రయాన్–3, ఆదిత్య ఎల్–1 ప్రయోగాలను విజయవంతంగా చేపట్టాం. ఇప్పుడు మనం కొత్త లక్ష్యాలను పెట్టుకోవాలి. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేయాలి. 2040 నాటికి చంద్రుడి మీదికి తొలి భారతీయుడిని పంపించాలి” అని ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ సూచించారు. ‘‘మనం మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలి. చంద్రుడిపై అన్వేషణ కొనసాగించాలి. వీనస్ ఆర్బిటర్, మార్స్ ల్యాండర్ లాంటి మిషన్స్ చేపట్టాలి” అని తెలిపారు. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు స్పేస్ డిపార్ట్ మెంట్ రోడ్ మ్యాప్ తయారు చేస్తుందని పీఎంఓ తెలిపింది. 

ఇందులో చంద్రయాన్ మిషన్స్, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్​జీఎల్వీ) తయారీ, కొత్త లాంచ్ ప్యాడ్, హ్యూమన్ సెంట్రిక్ లాబోరేటరీల ఏర్పాటు ఉంటాయని పేర్కొంది. సమావేశంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో చీఫ్ సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్పేస్​లోకి ఇద్దరు ఆస్ట్రోనాట్లను పంపేందుకు గగన్ యాన్ మిషన్​ను ఇస్రో చేపట్టింది. 

23 వేల కోట్ల మారిటైమ్ ప్రాజెక్టులు ప్రారంభం..  

సముద్రాల ద్వారా జరుగుతున్న వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళవారం గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమిట్ ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ.. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. రూ.23 వేల కోట్ల మారిటైమ్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గుజరాత్​లోని దీన్ దయాల్ పోర్టులో రూ.4,500 కోట్లతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ టర్మినల్ కు శంకుస్థాపన చేశారు.