సీరియల్ కిల్లర్ హిస్టరీ : కల్లు దుకాణాలకు వచ్చే మహిళలే టార్గెట్

సీరియల్ కిల్లర్ హిస్టరీ : కల్లు దుకాణాలకు వచ్చే మహిళలే టార్గెట్

మహబూబ్ నగర్: ఒంటరిగా కల్లు దుకాణాలకు వచ్చే మహిళలే టార్గెట్. అమాయకంగా కనిపిస్తే చాలు మాయమాటలతో మోసం.. హత్య తర్వాత.. బంగారం, వెండి నగల దోపిడీ. ఇదీ.. మహబూబ్ నగర్ ఓ సీరియల్ కిల్లర్ హిస్టరీ. ఓ మహిళ హత్య కేసులో అరెస్ట్ తో.. అతడి బండారం బయటపడింది. తీగలాగితే మరో మూడు హత్యల విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళల ఒంటిపై ఉండే నగల కోసం హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ పోలీసులు. స్థానిక శివశక్తి నగర్ లో ఉంటున్న ఎరుకలి శ్రీను.. కూచూర్ గ్రామానికి చెందిన 53ఏళ్ల అలివేలమ్మ ఒంటిపై ఉన్న నగలను దోచుకోవాలని ప్లాన్ చేశాడు. తిరుమలదేవుడి గుట్టలో ఉన్న కల్లు దుకాణంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

ఈ నెల 16న మాయమాటలు చెప్పి అలివేలమ్మను దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ శివారుకి తీసుకువెళ్లి మద్యం తాగించి హతమార్చాడు. తర్వాత ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకున్నాడు. ఈ విషయంలో సహకరించిన శ్రీను భార్య సాలెమ్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన శ్రీను ఇదే విధంగా మరో మూడు హత్యలు కూడా చేశారన్నారు మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరీ.