ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ల కోసం యాజమాన్యం ఎదురుచూపులు
డిసెంబర్‌లోగా ప్రొడక్షన్ స్టార్ట్చేయాలని సన్నాహాలు
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 10 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని టార్గెట్
కోల్‌బెల్ట్, వెలుగు: రాబోయే కొత్త ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులపై సింగరేణి సంస్థ గంపెడు ఆశలు పెట్టుకుంది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు వీలైనంత త్వరగా మూడు కొత్త ఓసీపీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి, కొత్తగూడెంలోని వీకే కోల్‌మైన్స్, ఇల్లందులోని రొంపేడు(జేకే)లో ఓసీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఫారెస్ట్డిపార్ట్ మెంట్పర్మిషన్లు రావాల్సి ఉంది. ఒడిశాలో ఫస్ట్ టైమ్ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్‌లో సెప్టెంబర్ నుంచి, మూడు కొత్త ఓసీపీలకు నవంబర్ నాటికి పర్మిషన్లు వస్తే డిసెంబర్నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్త ఓసీపీల నుంచి10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్పెట్టుకుంది.
బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం
గోలేటి, వీకే, రొంపేడు ఓసీపీలకు అవసరమైన ఫారెస్ట్పర్మిషన్లు పొందేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ఈనెల 5న ఆదేశాలు జారీ చేశారు. వీకే ఓసీపీకి వార్షిక ఉత్పత్తి టార్గెట్ 45 లక్షల టన్నులు కాగా, డిసెంబర్‌నాటికి ప్రారంభిస్తే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 7లక్షల టన్నుల ఉత్పత్తి చేయాలని చూస్తున్నారు. అలాగే రొంపేడు ఓసీపీ వార్షిక టార్గెట్20 లక్షల టన్నులు కాగా వచ్చే మార్చిలోపు 3 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియా గోలేటీ ఓసీపీ టార్గెట్35 లక్షల టన్నులు కాగా ఏడాది చివరి లోపు కనీసం 5 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒడిశాలోని నైనీబ్లాక్కు సంబంధించిన అన్ని పర్మిషన్లు వచ్చాయి. ప్రస్తుతం బొగ్గు తవ్వే ప్రాంతంలోని చెట్ల గణన, వాటి తొలగింపు పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికల్లా బొగ్గు ఉత్పత్తి చేపట్టనున్నారు. రాష్ట్రంలోని మూడు కొత్త ఓసీపీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా సుమారు10 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి కానుంది. ఏడాదిలో ఈజీగా100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించవచ్చని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రాగానే మొదటగా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీని ప్రారంభిస్తామని ఆ ఏరియా అధికారులు చెబుతున్నారు. మూసివేసిన గోలేటి1,1ఏ అండర్గ్రౌండ్మైన్లు, అబ్బాపూర్ ఓసీపీ కలిపి గోలేటీ ఓసీపీగా మారుతుందని, దీంతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం వస్తుందని అంటున్నారు. వీటితోపాటు 2024-– 25 ఆర్థిక సంవత్సరంలో రామగుండం కోల్‌మైన్స్‌ను, బెల్లంపల్లి ఏరియాలో ఎంవీకే ఓసీపీతోపాటు మరో రెండు ఓసీపీల ఏర్పాటుకు అవసరమైన పర్మిషన్లు సాధించేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. '
మూసివేసిన వాటి స్థానంలోనే..
సింగరేణికి కొత్తగా బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులు లేకపోవడంతో టార్గెట్లను సాధించడం కోసం గతంలో మూసివేసిన అండర్గ్రౌండ్మైన్ల స్థానంలో ఓసీపీలను విస్తరిస్తోంది. ఇలా అయితే పెద్దగా పర్మిషన్లు అవసరం ఉండదు. ఓసీపీ ఏర్పాటు కూడా ఈజీగా అయిపోతుంది. మూడు కొత్త ఓసీపీలకు అండర్ గ్రౌండ్మైన్ల భూములు ఉండగా, మరికొంత అటవీ, ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంది. వీటికి పర్యావరణ, అటవీశాఖ పర్మిషన్లు వస్తే సరిపోతుంది. గనుల విస్తరణ కావడంతో ఇతర పర్మిషన్లు కూడా తొందరగా వచ్చే చాన్స్ ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.

