
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి.. బుధవారం ( ఆగస్టు 27 ) నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్,కామారెడ్డి జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్న క్రమంలో రోడ్లు, రైల్వే ట్రాకులు సైతం దెబ్బ తిని రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి బోరజ్ మండలంలో తర్నామ్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
భారీగా వరద నీరు వచ్చి చేరడంతో తర్నామ్ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో జనం తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పెద్ద చెరువు కట్టకు గండి పడింది. దీంతో కట్ట తెగి పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.
Also read:-సింగూరుకు భారీ వరద... జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం
బుధవారం ( ఆగస్టు 27 ) మధ్యాహ్నం వ్యవసాయ పనులకు వెళ్లిన తొమ్మిది మంది యువకులు యాడారం చెరువులో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు రెస్క్యూ టీమ్స్ రక్షించడంతో సురక్షితంగా బయటపడ్డారు. బీబీపేట పెద్ద చెరువు కట్టకు గండి పడిన క్రమంలో కట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని...దీని ప్రభావంతో మెదక్ జిల్లా నిజాంపేట మండలపరిధిలోని నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాలకు ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఈ మూడు గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పోలీసులు సూచించారు.