
న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారని కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. ‘అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో ఉన్నారా? లేక ఎమ్మెల్యేలపై, పార్టీ నేతలపై కేసీఆర్ కు విశ్వాసం లేదా?’ అని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నరు. తన పార్టీ అమ్ముడుపోతుంది’ అని టీవీల ముందు చెప్పుకుంటున్న ఏకైక సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చుగ్ మాట్లాడారు. కేసీఆర్ కు దేశ ప్రధాని కావాలనే నయా సోకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే కేంద్రంలోని మోడీ సర్కార్ పై కేసీఆర్ నిరంతరాయంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. ఫామ్‌హౌస్ లో కూర్చొని కేసీఆర్ ఒక రాజకీయ సినిమాను స్క్రిప్ట్ రాశారని విమర్శించారు. అవన్నీ కేసీఆర్ జూటా ఆరోపణలని కొట్టిపారేసారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిమాండ్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ సచ్చీలుడే అయితే, బండి సంజయ్ లాగా ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాల్లో గెలిచినా..ఇతర పార్టీలకు చెందిన 26 మందిని కేసీఆర్ ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలె
తెలంగాణలో అభివృద్ధి పై దేశంలో ఎక్కడైనా చర్చకు రావాలని చుగ్, కేసీఆర్ కు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై తాను చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల టైంలో కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం. పెన్షన్లు, దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. హామీల అమలును విస్మరించిన కేసీఆర్ కు బై బై చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు.
మునుగోడులో బీజేపిదే విజయం
మునుగోడు బైపోల్ లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారం, నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలన ఓడిపోతుందన్నారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యథేచ్చగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్యం పక్షాన నిలిచారని, కేసీఆర్ కు బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు.