
కేసీఆర్ చేతిలో బందీలుగా పోలీసులు: తరుణ్ చుగ్
తెలంగాణలో లిక్కర్, లీకేజీ, డ్రగ్స్ మాఫియా నడుస్తోందని ఫైర్
కరీంనగర్, వెలుగు : తెలంగాణలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. కొంతమంది పోలీస్ అధికారులు సీఎం కేసీఆర్ చేతిలో బందీలుగా మారారని విమర్శించారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఆయన చెప్పినట్లు ఆడుతున్నారన్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి గులాంగిరీ చేయొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
బెయిల్ పై విడుదలైన సంజయ్ ను శుక్రవారం కరీంనగర్ లో తరుణ్ చుగ్ పరామర్శించారు. సంజయ్ అత్తమ్మ చిట్ల వనజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో తరుణ్ చుగ్ మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే, టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీని తెరపైకి తెచ్చి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ‘‘సంజయ్‌ను జైల్లో వేస్తే టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై పోరాటం ఆగిపోతుందని భావించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేం పోరాటం ఆపం. లీకేజీ మాఫియా బండారం బయటపడే వరకూ పోరాడుతం” అని స్పష్టం చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీలో కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తం ఉందని ఆరోపించారు.
ఇది ప్రజలందరీ విజయం..
సంజయ్ విడుదల 30 లక్షల మంది నిరుద్యోగుల, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల విజయమని తరుణ్ చుగ్ చెప్పారు. చివరికి ధర్మం, సత్యమే గెలిచిందన్నారు. కోర్టు ఉత్తర్వులు రాష్ట్ర సర్కార్ కు చెంపపెట్టు లాంటివన్నారు. వరంగల్ నుంచి నిరుద్యోగుల పక్షాన పోరాటం ప్రారంభిస్తామని తెలిపారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. తెలంగాణలో లీకేజీ, లిక్కర్, కరప్షన్, కేబుల్, డ్రగ్స్, లూట్ మాఫియా నడుస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి మండలి అలీబాబా 40 దొంగల ముఠాగా మారింది” అని విమర్శించారు.
కేసీఆర్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, త్వరలోనే బీఆర్ఎస్ పాలనకు బైబై చెబుతారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేదాకా పోరాడతామని చెప్పారు. లిక్కర్ దందాలో అన్ని విషయాలు బయటకొస్తాయని, లిక్కర్ క్వీన్ ఎవరో తెలిసిపోతుందని అన్నారు. లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే కేసీఆర్ కుటంబసభ్యులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
సంజయ్ ఫోన్ పోలీసులే ఎత్తుకెళ్లారు..
సంజయ్ ఫోన్ ను పోలీసులే చోరీ చేశారని తరుణ్ చుగ్ ఆరోపించారు. అది ఎలా తీసుకోవాలో తమకు తెలుసని అన్నారు. ‘‘సంజయ్ ను పోలీసులు బలవంతంగా తరలించే సమయంలో ఆయన చేతిలోనే మొబైల్ ఉన్న దృశ్యాలు టీవీలో కన్పించాయి. ఆ మొబైల్‌ను పోలీసులే చోరీ చేసి.. మళ్లీ మొబైల్ ఎక్కడుందని అడగడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు.
‘‘వరంగల్ కమిషనర్.. మీరు మాలిక్ కాదు, సేవకుడినని గుర్తుంచుకోండి. అబద్ధాలు ప్రచారం చేసే అధికారం మీకెక్కడిది? రాజ్యాంగంపై ప్రమాణం చేసి డ్యూటీ చేస్తున్న విషయం గుర్తుంచుకోండి” అని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ఇంకా 5 నెలలు మాత్రమే టైమ్ ఉందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు చరమగీతం పాడతారని పేర్కొన్నారు.
కేసీఆర్ వస్తే మోడీతో సన్మానం చేయిస్త: సంజయ్
కమలాపూర్ లో టెన్త్ విద్యార్థిని ఐదేండ్లు ఎలా డిబార్ చేస్తారని సంజయ్ ప్రశ్నించారు. ఫొటో తీసిన వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధిత విద్యార్థి చెప్పినా డిబార్ చేయడం దారుణమన్నారు. ఆ అబ్బాయి ఎగ్జామ్ రాసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కొడుకు, బిడ్డ మంచిగుంటే సరిపోతుందా.. మిగతావాళ్లు ఎట్లబోయిన పర్వాలేదా? అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్.. నువ్వు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తివి అయితే శనివారం ప్రధాని సభకు రా.. అక్కడికి వస్తే పెద్ద గజమాలతో ప్రధాని మోడీతో సన్మానం చేయిస్తా” అని చెప్పారు.