బీజేపీ పార్టీ కీలక నిర్ణయం

బీజేపీ పార్టీ కీలక నిర్ణయం
  • కో ఇన్‌‌చార్జ్‌‌గా అర్వింద్ మీనన్
  • 15 రాష్ట్రాలు, యూటీలకు ఇన్‌‌చార్జ్‌‌లను ప్రకటించిన హైకమాండ్​

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ తరుణ్ చుగ్‌‌ను కొనసాగిస్తూ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే దిశలో కో ఇన్‌‌చార్జ్‌‌గా అర్వింద్ మీనన్‌‌కు బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశాలతో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, యూటీలకు ఇన్‌‌చార్జ్‌‌లు, అందులో 9 రాష్ట్రాలకు కో ఇన్‌‌చార్జ్‌‌లను నియమించినట్లు తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు బీహార్‌‌‌‌, చత్తీస్‌‌గఢ్‌‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, నార్త్–ఈస్ట్​ స్టేట్స్​, చండీగఢ్‌‌, దాద్రా నగర్ హవేలీ, డామన్​ & డయ్యూ ఇందులో ఉన్నాయి.

రెండేండ్లుగా తరుణ్ చుగ్
బీజేపీ రాష్ట్ర ఇన్‌‌చార్జ్‌‌గా తరుణ్ చుగ్ రెండేండ్లుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఇటీవల సునీల్ బన్సల్‌‌ను రాష్ట్ర వ్యవహారాల (సంస్థాగత) ఇంచార్జ్‌‌గా నియమించింది. రాజకీయ వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌గా తరుణ్ చుగ్‌‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అర్వింద్ మీనన్.. ఎంపీలో కీ రోల్
బీజేపీ నేషనల్ సెక్రటరీ అర్వింద్ మీనన్.. తొలుత ప్రచారక్‌గా పార్టీలో సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. 2002 – 2003లో మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌‌‌‌లో సంఘటన్ పదాధికారిగా నియమితులయ్యారు. దాదాపు 13 ఏండ్ల పాటు మధ్య ప్రదేశ్‌‌లో పార్టీ బలోపేతం, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు. బీజేపీ నేషనల్ సెక్రటరీ హోదాలో జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం దిశలో పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని కో ఇన్‌‌చార్జ్‌‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.