కేసీఆర్ అహంకారం దించుతం

కేసీఆర్ అహంకారం దించుతం
  • హుజూరాబాద్​లో బీజేపే గెలుస్తుంది: తరుణ్​చుగ్​
  • 2023 ఎన్నికలకు ఇది ట్రయల్స్​.. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వెల్లడి
  • హుజూరాబాద్​లో వార్ వన్ సైడే: బండి సంజయ్
  • మొదటిసారి పార్టీ స్టేట్ ఆఫీసుకు వచ్చిన ఈటల రాజేందర్​
  • బైపోల్​కు ఇన్​చార్జ్​గా జితేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అహంకారాన్ని అణిచివేసి, వారసత్వ రాజకీయాలను అంతం చేసే ప్రజాతీర్పు హుజూరాబాద్​ ఉపఎన్నికలో బీజేపీ రానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్  చుగ్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే ఈ ఎన్నికలో గెలుపు ముమ్మాటికీ బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికలకు ఇది ట్రయల్స్ కాబోతున్నదని అన్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో తరుణ్​ చుగ్​ సమావేశమయ్యారు. పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్​తోపాటు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, పార్టీ నేతలు మంత్రి శ్రీనివాస్, స్వామి గౌడ్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్​లో హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే ప్రధాన చర్చ సాగింది. తరుణ్  చుగ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ బలమైన శక్తి అని, రాహుల్, మమత లాంటి వాళ్లే బీజేపీ ముందు తల వంచారని చెప్పారు. హుజూరాబాద్ బైపోల్​లో  ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఈటల రాజేందర్ అనుకొని పని చేస్తే టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్​ అన్నింటినీ వదులుకున్నారని చెప్పారు. 

కేసీఆర్ అహంకారాన్ని మనందరం కలిసి అణిచివేసే అవకాశం హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని బీజేపీ నేతలకు తరుణ్​ చుగ్​ సూచించారు. ఈ ఎన్నికలో బీజేపీని గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. చరిత్ర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలని, సత్యంతో దేన్నయినా సాధించవచ్చన్నారు. రైతులు, యువకులు, ఉద్యోగులను ఇలా అన్ని వర్గాల వారిని కేసీఆర్​ మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే ఎన్నిక హుజూరాబాద్​ బైపోల్​ అని అన్నారు. సోమవారం నుంచి18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, కరోనాను జయించేందుకు ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని వ్యాక్సినేషన్ సెంటర్ ను తరుణ్​ చుగ్​ సందర్శించారు.  
కేసీఆర్ తీరు ప్రజాస్వామ్యానికి అరిష్టం: ఈటల
ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి అరిష్టమని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. 50 రోజులుగా హుజూరాబాద్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజలను కలుస్తూ వారి మద్దతు పొందుతానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహాయ, సహకారాలతో భారీ మెజార్టీతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక్షస పాలన నుంచి హుజూరాబాద్ ప్రజలను కాపాడుకుంటానన్నారు. ఈ ఎన్నికలో కేసీఆర్ ఎన్ని అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నించినా చివరకు అంతిమ విజయం తనదేనని చెప్పారు. 
బీజేపీ స్టేట్ ఆఫీసుకు మొదటిసారి వచ్చిన ఈటల
బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసుకు ఈటల రాజేందర్​ వచ్చారు. ఆయనకు పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, స్వామి గౌడ్ తదితరులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈటలతో పాటు బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, గండ్ర నళినిని కూడా పార్టీ ఆఫీసులో సన్మానించారు. అనంతరం తరుణ్ చుగ్ తో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశానికి వీళ్లు హాజరయ్యారు. 
హుజూరాబాద్‌లో వార్ వన్ సైడే: సంజయ్
త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో వార్ వన్  సైడేనని, బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. ఈటల రాజేందర్​  తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. పోటీలో దింపేందుకు టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. కలెక్టర్లు  కేసీఆర్ కాళ్లు మొక్కడం సిగ్గుచేటని, కేసీఆర్ అధికారులను అలా శాసిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అన్ని పథకాలను కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని ఆయన మండిపడ్డారు.  కాగా, మైలా ర్ దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అందించిన రెండు శానిటైజర్ వెహికల్స్ ను బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ ప్రారంభించారు.

యోగా మన కల్చర్ లో భాగం 
 
రోజూ యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. హైదరాబాద్ బర్కత్ పురలోని బీజేపీ సెంట్రల్ జిల్లా ఆఫీసులో సోమవారం యోగా డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​గెస్ట్ గా హాజరైన తరుణ్ చుగ్ సాధన ఠాకూర్ రాసిన ‘యోగా ఫర్ కిడ్స్’ బుక్ ను ఆవిష్కరించారు. తర్వాత యోగా డేకు హాజరైన వారితో స్వయంగా యోగా చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షల ఏండ్లుగా యోగా మన కల్చర్ లో భాగంగా ఉన్నా ఎవరూ ఆచరించలేదన్నారు. మన జీవన విధానంలో భాగమైన యోగాను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రధాని మోడీ చొరవతో మళ్లీ యోగాకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. యోగాను మోడీ ప్రపంచ వేదికపై నిలిపారని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.