కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్కు రోజులు చాలా దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్లో నిరాశ పతాక స్థాయికి చేరుకుందని..అందుకే ముక్త్..ముక్త్ అంటూ పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ పిలుపు హాస్పాస్పదంగా ఉంది..
ప్రధాని నరేంద్ర మోడీని దూషిస్తూ కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తరుణ్ చుగ్ అన్నారు. బీహార్ పర్యటనలోనూ ప్రధానమంత్రి మోడీని సంబోధించడంలో కేసీఆర్ కనీస పరిమితిని కూడా ప్రదర్శించలేదన్నారు. ‘‘బీజేపీ ముక్త్ భారత్’’ అన్న కేసీఆర్ పిలుపు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీపై కేసీఆర్కు ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచ నాయకుడిగా మన్ననలు పొందుతున్న ప్రధాని మోడీపై కేసీఆర్కు పగ ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్కు తరుణ్ చుగ్ ప్రశ్నలు సంధించారు.

లాక్ డౌన్, ఆ తర్వాత పేదలకు ఉచిత రేషన్ ఇచ్చినందుకా..? ప్రజలకు రూ. 211 కోట్లకు పైగా ఉచిత వ్యాక్సిన్ లను అందించినందుకా..?  పేద మహిళలకు 12 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, వారికి పొగ రహిత జీవనం కల్పించినందుకా..?  దేశవ్యాప్తంగా రూ.12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినందుకా..? ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించినందుకా..?  ఇళ్లు లేని పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లు కట్టించినందుకా..? పేదలకు లభిస్తున్న ఈ ప్రయోజనాలను దూరం చేసేందుకే కేసీఆర్ ‘‘బిజెపి ముక్త్ భారత్’’  అంటున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. 

ఆత్మనిర్భర్ భారత్గా మారడం కేసీఆర్కు ఇష్టం లేదు
సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను నెలకొల్పుతూ ప్రధాని మోడీ దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరించారని తరుణ్ చుగ్ అన్నారు.  ఆత్మ నిర్భర్ భారత్ గా, ‘విశ్వగురువు’గా భారత్ను మార్చే దిశగా నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. దేశం ‘‘ఆత్మ నిర్భర్ భారత్’గా మారడం కేసీఆర్కు ఇష్టం లేనట్టుందన్నారు. రాజకీయంలో చివరి దశకు చేరుకున్న కేసీఆర్.. బీజేపీపై, ప్రధానిపై జుగుప్సాకరమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని కేసీఆర్ గ్రహించాలన్నారు. 

కార్యకర్త ఇంట్లో తేనీటి విందు

జనగామ జిల్లా :- ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం పేరుతో దళితులను మోసం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు.  మోడీ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సచివాలయం నుంచి పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ నక్షత్ర హోటల్ స్థాయిలో ఉన్న ఫామ్ హౌజ్ లో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజలను, పరిపాలనను పట్టించుకోకుంటే రానున్న రోజుల్లో ఇంటికి పోవడం తథ్యమన్నారు. 

చిలుపూరు మండలం చిన్నపెండ్యాలలోని దళితవాడలో తరుణ్ చుగ్ పర్యటించారు. బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాణాలు శ్రీనివాస్ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు. శ్రీనివాస్  కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. శ్రీనివాస్ అత్త, మామను శాలువతో సన్మానించి.. వారి పాదాలకు నమస్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు.