ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న తరుణ్ చుగ్

ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న తరుణ్ చుగ్

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్‌చుగ్‌ ఆగస్టు 12వ తేదీ శుక్రవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలతో తరుణ్ చుగ్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే వారి పేర్లను ఆయన పరిశీలించి.. వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యల అధ్యయన కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. 

యాదగిరిగుట్ట నుంచి మూడో విడత యాత్ర...
ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విషయానికి వస్తే... ఇప్పటికే రెండు విడతలుగా పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి దశ పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి, రెండో దశ పాదయాత్ర చారిత్రాత్మక  జోగులాంబ దేవాలయం నుంచి  ప్రారంభించారు. మూడో విడత యాత్ర ఆగస్టు 02వ తేదీ యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమైంది.  24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్ హన్మకొండ జిల్లాల మీదుగా బండి మూడో విడత పాదయాత్ర జరగనుంది. మొత్తం ఐదు జిల్లాల్లో ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్న పేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ వంటి 12 నియోజకవర్గాల్లోని 25 మండలాల్లో  పాదయాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 11వ తేదీ 9వ రోజు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర 12.5కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే చర్యల గురించి వారికి వివరించనున్నారు. రాత్రికి మునిపంపుల వద్ద బండి సంజయ్ బస చేయనున్నారు.

ప్రజా సమస్యలే  పాదయాత్ర ప్రధాన ఎజెండా...
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. అంతేకాదు..టీఅర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేయనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రజల్లో ఉద్యమస్పూర్తిని ఈ యాత్ర ద్వారా రగిలించాలని బీజేపీ కార్యచరణ రూపొందించింది. అలాగే ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసాను కల్పించనుంది.